దేశ‌వ్యాప్తంగా కరోనా మహమ్మారి క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఎవరి నుంచి ఎలా వస్తుందో అర్ధంకాని పరిస్థితి. తెలియని వ్యక్తులు ఎవరు కనిపించినా సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది.  తెలిసిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సి రావడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే.  కానీ, కరోనా వలన తప్పడం లేదు. ఏపీలో కేసుల క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న ద‌శ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్‌-19 పరీక్షలను పెంచేందుకుగానూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐమాస్క్‌ (ఇంటలిజెంట్‌ మానిటరింగ్‌ అనలైసిస్‌ సర్వీసెస్‌ క్వారంటైన్‌) బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

 

ఇంటలిజెంట్‌ మానిటరింగ్‌ అనలైసిస్‌ సర్వీసెస్‌ క్వారంటైన్ బస్సులను మొదట వీటిని కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రారంభించింది. క్రమంగా మిగతా జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు ఆ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కృష్ణా జిల్లాలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సేవలందిస్తున్న బస్సును ఆ జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ పరిశీలించారు. ఈ బస్సుల ద్వారా కృష్ణా జిల్లాతోపాటు విజయనగరంలో పలువురి నుంచి షాంపిళ్లు సేకరించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ బస్సులు ఐజీఎం స్టేడియం, ఎంబీపీ స్టేడియం, గునద‌ల చర్చి, కృష్ణలంకలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ఆధార్‌కార్డు తీసుకొని నేరుగా వెళ్లి కొవిడ్‌ పరీక్ష చేయించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని తెలిపారు. టెస్ట్‌లు చేయించుకునేందుకు ఎవరూ సందేహించవద్దని సూచించారు. పరీక్షలు చేయించుకున్నాక రెండు రోజుల్లో ఫలితాలు తెలియజేస్తారని చెప్పారు.

 

ఇదిలాఉండ‌గా, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. శనివారం రోజున ఈ జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.  ఇందులో 36 కేసులు సామర్లకోట మండలంలోని అమ్మణ్ణమ్మ కాలనీలో నమోదయ్యాయి. దీంతో ఆ కాలనీ మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి మూసేశారు.  ఈ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు ఈనెల 17 వ తేదీన హైదరాబాద్ వెళ్లొచ్చారు. ఈ ఇద్దరు మహిళలకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. తరువాత కాలనీలో నివసించే వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ కాలనీలో మొత్తం 36 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: