కరోనా.. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి.. తాజాగా మరో మైలు రాయి అందుకుంది. నవంబర్ లో చైనాలో ఒక్కటిగా పురుడుపోసుకున్న ఈ వైరస్ కేసు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోటి మార్కు దాటేసింది. జూన్ 27.. 2020న ప్రపంచవ్యాప్త కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. ఈ మార్కు అందుకునేందుకు దాదాపు ఏడు నెలు పట్టిందన్నమాట.

 

 

అసలు ఈ కరోనా ప్రస్థానం చూస్తే.. ముందు చైనాలో పుట్టింది. అక్కడి నుంచి థాయిలాండ్ కు సోకింది. అక్కడి నుంచి మలేషియాకు.. విమాన ప్రయాణాల ద్వారా చైనా నుంచి అమెరికాకు ఇలా.. ఒక్కో దేశానికే వ్యాపిస్తూ.. ఇప్పుడు కరోనా కేసులేని దేశమే లేనంతగా కబళించేసింది. విచిత్రం ఏంటంటే.. మొదట్లో ఈ వైరస్ తో వణికిపోయిన చైనా ఇప్పుడు దాన్ని దాదాపుగా కంట్రోల్ చేసేసింది.

 

 

కానీ ఇప్పుడు మిగిలిన దేశాలు ఈ వైరస్ తో పోరాడుతున్నాయి. అప్పట్లో మరణాలతో ఇటలీ ప్రపంచాన్ని భయపెట్టింది. అయితే అక్కడ మరణాలు అదుపులోకి వచ్చాయి. అమెరికాలోనూ వైరస్ ఎక్కువగా వ్యాపించింది. లక్ష మందికిపైగా మరణించారు కూడా. ఇపుడు 215 దేశాల్లో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి దాటింది. ఇందులో పావువంతు కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

 

 

ఇక తర్వాత స్థానాల్లో బ్రెజిల్ లో 12లక్షల కేసులు, రష్యాలో 6లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఇండియానే ఉంది. ఇండియాలో ఇప్పటివరకు ఐదున్నర లక్షల మందికి కరోనా వచ్చింది. కరోనాతో ప్రాణనష్టం అమెరికాలో భారీస్థాయిలో ఉంది. అమెరికాలో లక్ష 27వేలమందికి పైగా చనిపోయారు. బ్రెజిల్ లో 56వేల మంది.. యూకేలో 43వేల మంది.. ఇటలీలో 34వేల మంది, ఫ్రాన్స్ లో 29వేల మంది.. స్పెయిన్ లో 28వేల మంది.. మెక్సికోలో 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో 16వేలకు పైగా జనం ప్రాణాలు కోల్పోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: