తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటి వరకూ వందల్లో వచ్చిన కేసుల సంఖ్య ఇప్పుడు వెయ్యి దాటేసింది. ఒక్కరోజులోనే శనివారం రికార్డుస్థాయిలో ఏకంగా 1,087 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న తీరు భయాందోళనలు కలిగిస్తోంది. ఎనిమిది రోజుల్లోనే కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి.

 

 

శనివారం ఒక్కరోజులో 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇందులో 27.7 శాతం పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 19వ తేదీన 6,526 కేసులు ఉంటే శనివారం నాటికి 13,436కు చేరాయి. తాజాగా కరోనాతో చికిత్స పొందుతూ మరో ఆరుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాతో తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 243కి చేరింది.

 

 

పేరుకు తెలంగాణ అని చెబుతున్నా.. ఇందులో అత్యధికం కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. శనివారం వచ్చిన వెయ్యి కేసుల్లో దాదాపు 900 సరిగ్గా చెప్పాలంటే 888 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వచ్చాయి. ఇక మిగిలినవి కూడా రంగారెడ్డిలో 74 నమోదయ్యాయి. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే.. నల్గొండ జిల్లాలో ఒక్కరోజులోనే 35 మందికి వైరస్‌ సోకింది. మేడ్చల్‌లో 37 కేసులు, సంగారెడ్డిలో 11 కేసులు వచ్చాయి.

 

 

ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ చికిత్స నుంచి కోలుకుని 162 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 8,265 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షల సంఖ్య 3 వేలలోనే ఉంటేనే ఇన్ని కేసులు వస్తున్నాయి. ఇంకా పరీక్షల సంఖ్య పెంచితే కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: