చరిత్రలో కొన్ని నిజాలు నమ్మశక్యం లేనట్టుగా ఉంటాయి. అవును.. చరిత్రలో ఏ మలుపు ఎందుకు జరుగుతుందో. ఏ పరిణామం ఎటు దారి తీస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిదే రాజీవ్ గాంధీ హత్య కూడా. రాజీవ్ గాంధీ హత్య జరగకపోయి ఉంటే.. మన తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు భవితవ్యం వేరేగా ఉండేది. అప్పటికే కేంద్ర మంత్రి వరకూ అనేక పదవులు నిర్వహించిన ఆయన ఇక రిటైర్‌ మెంట్ ప్రకటించే సమయానికి రాజీవ్ హత్య జరిగింది.

 

 

అయితే ఇందిరాగాంధీ హయంలో ఓ వెలుగు వెలిగిన మన పీవీ నరసింహారావు .. ప్రధాని పగ్గాలు రాజీవ్ గాంధీ చేతికి వచ్చేసరికి కాస్త నెమ్మదించారు. రాజీవ్ గాంధీ ఆయన్ను పక్కన పెట్టడం ప్రారంభించారు. అప్పటికే రాజకీయంగా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన పీవీ కూడా రాజకీయాల నుంచి వైదొలగేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో తమిళనాడు లోని కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠం నుంచి పీవీకి ఓ లెటర్ వచ్చింది.

 

 

పీవీకి ఆ మఠంతో దగ్గరి సంబంధం ఉంది. ఆయన తరచూ ఆ మఠాన్ని సందర్శించేవారు. అక్కడి సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ పీఠాధిపతి అయిన మౌనస్వామి కన్నుమూసిన తర్వాత ఆ పీఠం నడిపించేవారి కోసం ఆశ్రమ నిర్వాహకులు ఎంతగానో వెదికారట. వారికి పీవీయే తగిన యోగ్యుడని భావించారట. పీవీ అభిప్రాయం కోసం ఆయనకు లేఖ రాశారు. ఆయన కూడా దాన్ని అంగీకరించే ఆలోచనలో ఉన్నారు.

 

 

సరిగ్గా అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టనని తేల్చి చెప్పారు. ఇక అప్పుడు సోనియాకు సరైన వ్యక్తిగా పీవీ కనిపించారు. ఎందుకంటే ఆయనకు సొంత గ్రూప్ అంటూ ఏదీ లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని పదవికీ పలువురు నేతలు పోటీ పడినా..అది చివరకు తనను కోరుకోని పీవీని వరించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: