ఏపీ ప్రభుత్వం పేదలకు షాక్ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఇకపై రేషన్ భారం కానుంది. ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ కరోనా విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో ఆరు విడతల ఉచిత రేషన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు రేట్లను భారీగా పెంచింది. అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం చక్కెర రేట్లు యథాతథంగా ఉంటాయి. 
 
సాధారణ రేషన్ కార్డుదారులకు మాత్రం పెరిగిన రేట్లు వర్తించనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం కందిపప్పుపై 67.5%. పంచదారపై 70% రేట్లను పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వం మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కిలో కందిపప్పు 40 రూపాయలకు, అరకిలో చక్కెర పది రూపాయలకు పెంచింది. ప్రభుత్వం ఇకపై మార్కెట్ లో ధర ఎంతున్నా 25 శాతం రాయితీకే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. 
 
పెంచిన ధరలు జులై నెల నుంచే అమలు కానున్నాయి. ఈ సంవత్సరం అంతా జగన్ సర్కార్ ఇవే ధరలను అమలు చేస్తే ప్రజలపై 550.80 కోట్ల రూపాయల అధిక భారం పడనుంది. జగన్ సర్కార్ కందిపప్పు, పంచదార ధరలను ఈ సంవత్సరం ప్రారంభంలో సమీక్షించింది. మార్కెట్లో ఉన్న ధరపై 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా వైరస్ విజృంభణ వల్ల నిర్ణయం అమలు కాలేదు. 
 
మార్చి నెలాఖరు నుంచి ఉచితంగా నిత్యావసరాలు ఇస్తామని జగన్ సర్కార్ ప్రకటన చేయడంతో ధరల పెంపు నిర్ణయం అమలులోకి రాలేదు. ప్రభుత్వం నెలకు రెండుసార్లు చొప్పున బియ్యం, కందిపప్పులను ఉచితంగా అందించింది. జులై నుంచి సాధారణ రేషన్ పంపిణీ మొదలు కానుండటంతో ప్రభుత్వం పెంచిన ధరలను వచ్చే నెల నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: