మిడతల దండు బెడదకు దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లోకి మిడతలు ప్రవేశించాయి. గురుగ్రామ్‌ను  వేల సంఖ్యలో మిడతలు చుట్టేశాయి. వీటిలో చాలావరకు హర్యానాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. ఢిల్లీలోకి మిడదల దండు దూసుకొస్తుండటంతో.. అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఢిల్లీ సర్కారు ఆదేశించింది. 

 

పంటలను నాశనం చేసే మిడతల దండు ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చేరుకుంది. గురుగ్రామ్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తున్న మిడతలను ప్రజలు వీడియోలు తీశారు. ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మిడతలు ఇంకా దేశ రాజధానిలోకి ప్రవేశించలేదు. గురుగ్రామ్‌లో మిడతల దాడి పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులకు ప్రభుత్వం పలు సలహాలు అందించనున్నట్లు వెల్లడించారు.

 

మిడతల దండులో కొంతభాగం ఢిల్లీ సరిహద్దుల్లో ఉండటంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. డోలు, డ్రమ్ము వాయించి, పెద్ద శబ్దం చేయాలని చెబుతున్నారు. పంటలకు నష్టం లేకుండా పురుగు మందులు పిచికారీ చేయడానికి ట్రాక్టర్లు సిద్ధంగా ఉంచారు. ఢిల్లీ నగరంలో పౌరులు ఇళ్ల తలుపులు, కిటికీలు మూసే ఉంచాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వీలైతే ఇళ్లలో మొక్కలు కూడా ప్లాస్టిక్ షీట్లను కూడా కప్పి ఉంచాలని సూచించింది. రాత్రి వేళ మెలాథియాన్, క్లోరోపిరిఫోస్ లాంటి పురుగు మందులు చల్లాలని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత మిడతలు ఎగరవు కాబట్టి.. అప్పుడు మొక్కలపై ఉండేవన్నీ ఇవి చల్లితే చనిపోతాయని అంటున్నారు. 

 

ఢిల్లీతో పాటు నోయిడా అధికారులు కూడా అలర్టయ్యారు. హర్యానా సర్కారు ఇప్పటికే గురుగ్రామ్ సమీపంలో ఉన్న జిల్లాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తోపాటు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోకి దూసుకుపోతున్న మిడతల సమూహాలు పంటలను నాశనం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: