దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితాలను కరోనా తలకిందులు చేసింది. రోజు వారీ కూలీలు, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి కాలినడకన సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. శ్రామిక్ రైళ్ల ద్వారా మరికొందరు ఊళ్లకు చేరుకున్నారు. 
 
అయితే రోజురోజుకు వైరస్ విజృంభిస్తోందే తప్ప తగ్గటం లేదు. దీంతో వలస కార్మికులు ఉపాధి కోసం తిరుగుపయనమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో వలస కార్మికులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అన్సారీ అనే వలస కూలీ తమకు పని దొరకలేదని..... తన సంస్థ ఇంకా తెరచుకోలేదని.... ఏదో పని దొరుకుతుందని ఇతర ప్రాంతాలకు తిరిగి వెళుతున్నానని అన్నారు. 
 
తన పిల్లలు ఆకలితో చనిపోవడం కంటే కరోనాతో చనిపోవడమే మేలని చెప్పారు. దివాకర్ అనే మరో వలస కూలీ కోల్ కతాలోని ఒక పరిశ్రమలో తాను టెక్నీషియన్ గా పని చేశానని.... హోలీ పండుగకు వచ్చి లాక్ డౌన్ వల్ల స్ట్రక్ అయిపోయానని... పరిశ్రమలు తిరిగి తెరచుకోవడంతో కోల్ కతాకు తిరిగి పయనమయ్యానని చెప్పారు. ముంబైకు చెందిన 20 ఏళ్ల అహ్మద్ దబిద్ అనే యువకుడు వలస కార్మికుల కోసం కేంద్రం ప్రకటించిన పథకాల వల్ల తమకు ప్రయోజనం చేకూరలేదని అన్నారు. 
 
మరో వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నా ఇతర అవసరాలకు డబ్బు అవసరం కావడంతో కరోనా విజృంభిస్తున్నా పనిలోకి వెళ్లక తప్పడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పని కల్పించామని చెబుతున్నా దాదాపు 30 లక్షల మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: