జీహెచ్ఎంసీ ప‌రిధిలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి తేనున్న‌ట్లుగా సీఎం కేసీఆర్ విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించేశారు. కేబినేట్‌లో చ‌ర్చించిన అనంత‌రం తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పిన‌ప్ప‌టికి...లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డం త‌థ్యంగానే క‌నిపిస్తోంది. వాస్త‌వానికి గ‌త కొద్దిరోజులుగా హైద‌రాబాద్‌లో 800ల‌కు పైగా కేసులు ప్ర‌తీ రోజు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. ప్రైవేటు ల్యాబుల‌కు క‌రోనా టెస్టుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో ప‌రీక్ష‌లు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈనేప‌థ్యంలోనే అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగిన వారు ల్యాబుల త‌లుపు త‌డుతుండ‌టంతో నిర్ధార‌ణ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైద‌రాబాద్‌లో శ‌నివారం ఒక్క‌రోజూ  11వంద‌ల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం అంద‌రిలోనూ ఆందోళ‌న క‌లిగిస్తోంది.


గ‌డిచిన వారం రోజులుగా హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు,చిరు వ్యాపారులు స్వ‌చ్ఛందంగా బంద్ పాటిస్తుండ‌టం గ‌మ‌నార్హం. బ‌తికుంటే బ‌లుసాకు తిన‌వ‌చ్చు..కాని ముందు ప్రాణాలు కాపాడుకోవాల‌న్న ఆలోచ‌న‌తో చాలా మంది వ్యాపారాల‌కు, ఉద్యోగాల‌కు, ఉపాధికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.  ప్రభుత్వ నిర్బంధ లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేసిన ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగానే ‘కట్టడి’ విధించుకుంటున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసుకుంటున్నారు. మసీదులు, ఆలయాల్లో స్వీయ నియంత్రణ మొదలైంది. కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంక్షలను సడలించడంతోనే పరిస్థితి తీవ్రమైందని జనం మండిపడుతున్నారు. 


దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని  బేగంబజార్, ఫీల్‌ఖానా, ఉస్మాన్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్, హోల్‌సేల్ కిరాణా, జువెల్లరీలాంటి దుకాణాలను జూలై ఐదు వరకు తెరవబోమని యజమానులు ప్రకటించారు. విద్యుత్​, వ్యవసాయ, గృహోపరకరణాలకు సంబంధించి ఎక్కువ వ్యాపారం జరిగే రాణిగంజ్​ దుకాణ అసోసియేషన్​ కూడా ఆదివారం నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నట్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. సెలూన్లను కూడా మూసి ఉంచుతున్నారు.  ఇలా ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా బంద్‌కు ముందుకు వ‌స్తుండ‌టం, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు,వైద్య నిపుణులు కూడా రాష్ట్రంలోని ప‌రిస్థితిని స‌మీక్షించి లాక్‌డౌన్‌కు వెళ్ల‌డ‌మే స‌బ‌బు అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.  ఈ అంశాల‌నన్నంటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ అమ‌లు చేసేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: