రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఆ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కొన్ని నియోజకవర్గాల్లో ఒకటి, రెండు సార్లు ఓడిపోయిన మిగతా అన్నీ ఎన్నికల్లోనూ విజయాలు అందుకుంది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో  అలాంటి కంచుకోటల్లో సైతం టీడీపీ ఊహించని విధంగా ఓటమి పాలైంది. అసలు ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గాల్లో సైతం ఘోరంగా ఓడిపోయింది.

 

అయితే జగన్ గాలిలో సైతం కొన్ని కంచుకోటల్లో టీడీపీ విజయాలని అందుకుంది. అలా జగన్ వేవ్‌కు చెక్ పెడుతూ టీడీపీ విజయం సాధించిన నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారే ఓటమి పాలైంది. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ గాలిలో టీడీపీ పరాజయం చెందింది. ఇక 1983, 85, 89, 1994, 99, 2009, 2014, 2019 ఎన్నికల్లో అదిరిపోయే విజయాలు అందుకుంది.

 

2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్‌ని తట్టుకుని విజయం సాధించిందంటే, ఉండిలో టీడీపీ ఎంతబలంగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు) ఉన్నారు. ఈయన అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఇక్కడ అనుకున్న మేర పనులు జరగడం లేదు.

 

అలా అని అధికారంలో ఉన్నా కూడా, ఇక్కడ వైసీపీ బలపడలేదు. వైసీపీ ఇన్‌చార్జ్ పి‌వి‌ఎల్ నరసింహ రాజు పనితీరు సరిగా లేదనే తెలుస్తోంది. నియోజకవర్గంలో ఈయనకు పెద్ద ఫాలోయింగ్ కూడా లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఈయనే బరిలో ఉంటే ఉండి సీటు మళ్ళీ టీడీపీ ఖాతాలోకే వెళ్ళడం ఖాయమని ఉండి వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ జగన్ ఇంకో నేతని రంగంలోకి దించినా, అప్పుడు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు(కలవపూడి శివ) టీడీపీ తరుపున ఉండి బరిలో ఉంటే వైసీపీ గెలుపు సాధ్యం కాదని అంటున్నారు.

 

వెస్ట్ గొదావరిలొ మంచి పేరున్న కలవపూడి శివ రెండుసార్లు ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి, మొన్న ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బరిలో దిగి, రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. అయితే ఈయన నెక్స్ట్ ఉండికి వచ్చేయాలని చూస్తున్నారట. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక శివకు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సోదరుడు వరుస అవుతాడు. ఒకవేళ శివ మళ్ళీ ఉండికి వస్తే రామరాజుకు కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఎన్నికల్లో ఎవరు నిలబడిన ఉండిలో టీడీపీ జెండా ఎగరడమనేది ఖాయమని అర్ధమవుతుంది. కాబట్టి టీడీపీ ఖాతాలో ఉండి సీటు ఎప్పుడు ఉండాల్సిందే అని వెస్ట్ తమ్ముళ్ళు ధీమాతో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: