తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా  ప్ర‌భుత్వం  అదనపు బాధ్యతలు అప్పగించింది. తనకు ప్రి మెచ్యూర్ రిటైర్మెంట్ కావాలని ఈనెల 24న కేంద్ర హోం మంత్రికి వీకే సింగ్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వ‌హిస్తూ ఇటీవ‌ల కాస్త ఘాటుగానే విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 

 


అంతేకాక తన సేవలకు తగిన గుర్తింపు ద‌క్క‌లేదంటూ  వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 124 మందికి ఈ వైరస్‌ సోకింది. అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురికి కరోనా బాధితులుండ‌టం గ‌మ‌నార్హం. అకాడమీలో పనిచేసే ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీసీలు, ఎనిమిది మంది ఇన్స్‌పెక్ట‌ర్లతో సహా అక్కడున్న మెడికల్ సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వారందరినీ ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ అకాడమీలో 1900 కాడేట్‌లు శిక్షణ పొందుతుండగా.. వారికి త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. 

 


ఈ నేపథ్యంలో 124 మందికి వైరస్ సోకడంతో అధికారుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే పోలీసు అకాడెమీలో 180 మందికి కరోనా సోకినట్టుగా వీకే సింగ్  ప్ర‌క‌టించ‌డం వివాదాస్పందంగా మారింది.  ప్రభుత్వ ప్రకటన వెలువడకముందే కేసుల విషయాన్ని బహిర్గతం చేయడం కూడా వీకే సింగ్‌ బదిలీకి కారణమైంద‌న్న వాద‌న‌ను కొంత‌మంది పోలీస్ అదికారులు వినిపిస్తున్నారు. అయితే బ‌దిలీపై వీకేసింగ్ ఎలా స్పందిస్తారోన‌ని ఇప్పుడు పోలీస్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: