పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగా ఎలివేట్ కావాలనుకుంటున్నారో ఏమో కానీ ఆయన ఒక్కసారిగా జగన్ మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. గత ఎన్నికల్లో కాపులంతా గుత్తమొత్తంగా జగన్ కే మద్దతు ప్రకటించారు. జగన్ అధ్బుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు జగన్ కాపుల కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కాపు నేస్తం పేరిట జగన్ తాజాగా ప్రవేశపెట్టిన పధకంతో పవన్ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు.

 

కాపుల రిజవేషన్ల సంగతేంటని గొంతు విప్పారు. అసలు పవన్ నోట కాపుల రిజర్వేషన్ల మాట రావడమే విడ్డూరం అంటున్నారు చాలా మంది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో ముద్రగడ పద్మనాభం అయిదేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేస్తే పవన్ కనీసం మద్దతు ఇవ్వలేదని వైసీపీ నుంచి కామెంట్స్ వరసగా వచ్చిపడుతున్నాయి.

 

ఇప్పటికే మంత్రి, కాపు నాయకుడు కురసాల కన్నబాబు పవన్ కి గట్టి రిటార్ట్ ఇచ్చారు. చంద్రబాబు వైపు ఉండి పవన్ మాట్లాడుతున్నారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఆ తరువాత కాపు యువ నేత, కాపు కార్పోరేషన్ చైరం జక్కంపూడి రాజా కూడా పవన్ని గట్టిగా తగులుకున్నారు. పవన్ కి కాపుల మద్దతు లేదని కూడా సెటైర్లు వేశారు. 

 

ఇపుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు పవన్ కి ఘాటైన సమాధానం చెబుతూ పవన్ ముందు తన లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. గత అయిదేళ్ళూ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన పవన్ కి అసలు కాపుల గురించి.వారి జాతి గురించి తెలుసా అని గట్టిగానే నిలదీశారు. చంద్రబాబు కాపులను నిలువెల్లా  మోసం చేస్తే నాడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని కూడా త్రిమూర్తులు అడిగేశారు, కడిగేశారు. 

 

కాపులు ఎక్కువగా ఉన్న గాజువాక, భీమవరంలో పవన్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించడం ద్వారా పవన్ కి కాపుల మద్దతు లేదని త్రిమూర్తులు తేల్చేశారు. మరి పవన్ కాపుల మీద జగన్ని టార్గెట్ చేస్తూ  ఇలా మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: