ఒకవైపు కరోనాతో లోకం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే, మరోవైపు మూఢ నమ్మకాలు మనిషిని మూర్ఖంగా మారుస్తూ ఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్దితిలో మరణించిన వారు అనాధ శవాల్లా మారుతున్నారు.. మరికొందరి అనాలోచిత నిర్ణయాల వల్ల మరణించిన వారికి కూడా కష్టాలు తప్పడం లేదు.. ఒక రకంగా మనిషిని మనిషిగా చూడడం లేదని చెప్పవచ్చూ..

 

 

ఇకపోతే ఇప్పుడు చదవబోయే సంఘటన మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేస్తుంది.. మానవత్వాన్ని మంట గలిపేసిన ఈ ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలోని బి.నాగిరెడ్డి పల్లెలో చోటుచేసుకుంది.. బి.నాగిరెడ్డి పల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20) కు ఏడాదిన్నర క్రితం వివాహం అవగా, ప్రస్తుతం లావణ్య నిండు గర్భిణి.. కాగా నొప్పులు రావడంతో ఆమెను ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది.

 

 

అయితే లావణ్య మృత దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బి.నాగిరెడ్డి పల్లెకు తీసుకొచ్చి, కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృత దేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు.

 

 

అయితే నిన్న ఆదివారం రుద్రవరం, గోనంపల్లె, అప్పనపల్లె గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లుతుండగా అక్కడ ఒక చెట్టుకు తాళ్లతో కట్టేసిన మృత దేహం కన్పించింది. భయభ్రాంతులకు గురైన వారు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.. వెంటనే స్పందించిన వారు మృతురాలి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: