కాపు నేస్తం నిధులు విడుదల అంశం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. ముఖ్యంగా జనసేన వర్సెస్ వైసిపి అన్నట్లుగా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిధులు విడుదలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేయగా, వైసిపి కాపు నాయకులు అంతా పవన్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో, కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ఆయన పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ, ఆందోళనలు నిర్వహించిన సమయంలో, ఆయన పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అనుచితంగా వ్యవహరించడమే కాకుండా, ఆయనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని, అప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని, అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కవడం కారణంగానే ఆ వ్యవహారంలో ఆయన స్పందించేందుకు ఇష్టపడలేదని, ఇలా ఎన్నో ఆరోపణలు వైసిపి చేస్తోంది. 

 


ఏపీలో ఇంత జరుగుతున్నా తన చుట్టూ ప్రస్తుతం రాజకీయ నడుస్తున్నా, స్పందించేందుకు కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముందుకు రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభం ను టార్గెట్ చేసుకుని జనసైనికులు అనేక విమర్శలు చేస్తున్నారు. ముద్రగడ విషయంలో పవన్ ఎందుకు స్పందించాలని, అసలు ముద్రగడ ఏం చేశారని ? గతంలో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి కి అండగా నిలబడకుండా, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత పై పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారని, మూడో స్థానంలో ఆయన నిలిచారని జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.

 


 ఇక జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరించారని, ఒకే సామాజిక వర్గం అని పట్టించుకోకుండా, వైసిపి అనుకూలంగా వ్యవహరించారని, ఇప్పుడు ఈ వ్యవహారంలో పవన్ ఎందుకు స్పందించాలని వారు ప్రశ్నిస్తున్నారు. కాపులు ఏకం కావాలని పదేపదే చెబుతూ వస్తున్న ముద్రగడ పద్మనాభం ఆ పని ముందు తాను ఎందుకు చేయడం లేదని విమర్శిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో రిజర్వేషన్లు అంశంపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆయన, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులనే పేరు మార్చి ఇప్పుడు కాపు నేస్తం పేరుతో ఇస్తోందని, జనసైనికులు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: