అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిష్ఠించాలనుకున్నారు ట్రంప్‌. కానీ అతని స్వయం కృతాలకు ప్రకృతి తోడై కరోనా రూపంలో కరాళ నృత్యం చేస్తోంది. మరోవైపు... సర్వేలన్నీ ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయి. దీంతో ట్రంప్‌ కళ్లముందు ఓటమి కదలాడుతోంది. ఇంకేముంది అధ్యక్షుల వారు నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ఓ వైపు ఓటమిని అంగీకరిస్తూనే... మరోవైపు ప్రత్యర్థి బైడెన్‌పై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు ట్రంప్‌. 

 

2015లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్ విజయం ఎవరూ ఊహించలేదు. వ్యాపార రంగానికి చెందిన ట్రంప్‌కు రాజకీయ అనుభవం లేదు. దీంతో అతని గెలుపుపై సొంత పార్టీ రిపబ్లికన్లకే నమ్మకం లేదు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు లాంఛనమేనని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భావించారు. హిల్లరీ మరీ ఎక్కువ మెజారిటీ రాకుండా ఆడ్డుకోవాలన్నదే రిపబ్లిక ఆలోచన. కానీ అనూహ్యంగా అమెరికన్లు ట్రంప్‌కు పట్టం కట్టారు. అయితే ట్రంప్‌ అధ్యక్షుడికి కొనసాగడానికి వీల్లేదంటూ కొంత కాలం ఉద్యమాలు కూడా నడిచాయి. మరోవైపు... అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనూహ్య నిర్ణయాలతో తన గ్రాఫ్‌ను తానే  దిగజార్జుకుంటూ వచ్చారు ట్రంప్‌. 

 

అమెరికా ఫస్ట్ ఎగైన్ నినాదంతో అధికారంలోకొచ్చిన ట్రంప్ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపకపోగా... తన నిర్ణయాలతో మరింత వెనక్కి తీసుకెళ్లారు. ట్రంప్ హయాంలో దేశంలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. ఇక కరోనా విషయంలో ట్రంప్ వైఫల్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా మహమ్మారి ముంచుకొస్తుంటే... ట్రంప్‌ కనీస జాగ్రత్తలు పాటించకుండా దేశాన్ని బలి చేశారనేది ఆరోపణ. అత్యుత్తమ వైద్య సౌకర్యాలు గల తమ దగ్గరనే ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని కరోనా కేసులు, మరణాలు నమోదు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు అమెరికన్లు. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యమే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు జనం.  


 
కరోనా తర్వాత అమెరికా సమాజాన్ని కదిలించిన మరో అంశం ఆఫ్రో అమెరికన్ జార్జ్‌ ఫ్లాయిడ్ హత్య. శ్వేతజాతి పోలీసుల అహంకారానికి బలయిపోయిన ఫ్లాయిడ్‌పై అమెరికా వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తింది. మాకు ఊపిరాడడం లేదు అనే నినాదాలతో నల్ల జాతీయులు, వారికి  మద్దతుగా శ్వేతజాతీయులు ఆందోళనలు చేశారు. ఫ్లాయిడ్‌ హత్యను ఖండిస్తూ జరిగిన నిరసనలతో మూడు వారాల పాటు అమెరికా అట్టుడికి పోయింది. 

 

ఫ్లాయిడ్‌ హత్యతో చెలరేగిన ఆగ్రహావేశాలు చల్లారినా... నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం రూపంలో ట్రంప్ వైఫల్యాలు అమెరికన్ల కళ్లముందు కదలాడుతున్నాయి. అన్ని సర్వేల్లో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను ముందంజలో ఉన్నారు. దేశంలోని 55 శాతం ప్రజలు బిడెన్‌కు మద్దతుపలుకుతున్నారు. కేవలం 40 శాతం మంది ట్రంప్‌ వైపు ఉన్నారని, ట్రంప్‌కు ఓటమి తప్పదని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

 

ఏ విషయంలోనైనా మొండిగా ఉండే ట్రంప్‌... శ్వేత సౌధాన్ని వీడే రోజు దగ్గర్లోనే ఉందనే విషయాన్ని మాత్రం తొందరగానే గ్రహించారు. ఇదే అతన్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను  ఓడిపోబోతున్నానని స్వయంగా చెప్తున్నారు ట్రంప్‌. పనిలో పనిగా ప్రత్యర్థి జో బిడెన్‌పై అక్కసునూ వెళ్లగక్కుతున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు. ఆయన మంచోడా, కాదా అనేది  అనవసరం, కానీ అలాంటి వ్యక్తి అధ్యక్షునిగా పనికిరారు అని బిడెన్ గురించి వ్యాఖ్యానించారు ట్రంప్. తాను దేశానికి ఎంతో చేశానని, అయినా కొందరికి నచ్చడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.  

 

సాధారణంగా ఎన్నికల బరిలో దిగే ఏ ఒక్కరూ... ఎన్నికలకు ముందే ఓటమి గురించి మాట్లాడరు. కనుచూపు మేరలో పరాజయం కనిపిస్తున్నా... దాన్ని అంగీకరించేందుకు సిద్ధపడరు.  ట్రంప్‌ లాంటి మనస్తత్వం గల వాళ్లు ఓటమి ఊసెత్తడానికి కూడా ఇష్టపడరు. కానీ... ట్రంప్‌ ఇప్పుడు తనంతట తానుగా తన ఓటమి గురించి, ప్రత్యర్ధి గెలుపు గురించి మాట్లాడుతున్నారు. అంటే, దేశంలో తనపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఆయన గ్రహించారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: