తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల క‌ల‌క‌లం, హైద‌రాబాద్‌లో లాక్ డౌన్ మ‌రోమారు అమ‌లు చేయ‌డంపై మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి ఈ విష‌యంలో తుది  నిర్ణయం తీసుకుందామని సీఎం కేసీఆర్‌ చెప్పారని మంత్రి ఈట‌ల వివ‌రించారు. జీహెచ్ఎంసీలో కంటైన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చేయ‌నున్నట్లు మంత్రి వెల్ల‌డించారు. 

 

హైద‌రాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం చేస్తున్నార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన మంత్రి ఈట‌ల ఈ త‌ర‌హా ప్ర‌చారం బాధాకరమ‌ని వాపోయారు. తాజాగా చాతి ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ, చెస్ట్ హాస్పిటల్‌లోకి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్ కి తిరిగిన తరువాత వచ్చారని... అర్ధ‌రాత్రి వచ్చినా కూడా చేర్చుకొని రాత్రి అంతా ఆక్సిజన్ ఇచ్చామని వెల్ల‌డించారు. ఆ వ్య‌క్తి గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరమ‌ని పేర్కొన్న మంత్రి ఈట‌ల‌ ఆక్సిజన్ అందిచలేదు అనడం నిజం కాదన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో 258 మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు క‌రోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. చెస్ట్ హాస్పిటల్‌లో హెడ్ నర్స్ విక్టోరియా చనిపోయిందని తెలిపారు. హెల్త్ సెక్రెటరీ ఆఫీస్‌లో 11 మందికి కరోనా సోకిందని పేర్కొంటూ...వీరంద‌రికీ గాంధీలో చికిత్స అందిస్తున్నామ‌న్నారు. ఒక్కరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దని మంత్రి ఈట‌ల విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా చికిత్స కోసం ప్రస్తుతం 17081 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయ‌న వెల్ల‌డించారు. ఇందులో 3500 బెడ్ల‌కు ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉందని ప్ర‌క‌టించారు. మరో 6500 బెడ్ల‌కు రెండు రోజుల్లో ఆక్సిజ‌న్ సౌల‌భ్యం అందిస్తామ‌న్నారు. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్‌తో సిద్దం అవుతున్నాయని ఈట‌ల పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య సేవ‌ల‌కు సంబంధించిన బెడ్ల‌కు కొదువలేదని మంత్రి తెలిపారు.
అనవసరంగా ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ప్రైవేట్ లాబ్స్ ప‌రీక్ష‌ల‌లో కొన్నింటిలో 70-80 శాతం పాజిటివ్ కేసులు రావడంపై అనుమానాలు ఉన్నాయని మంత్రి ఈట‌ల తెలిపారు. అధికారులు వీటిపై తనిఖీలు చేస్తున్నారని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: