కరోనా అంతకంతకూ విజృంభిస్తోందే తప్ప... తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రోజువారీ నమోదవుతున్న కేసులు 20 వేలకు చేరువలో ఉన్నాయి. అయితే, సెప్టెంబర్‌ నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 20 కోట్ల మంది కరోనా బారినపడతారనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  

 

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. అమాంతం పెరిగిపోతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో రోజూ దాదాపు 20 వేల  ఇప్పటికే 5 లక్షలు దాటిన కేసులు... మూడు నాలుగు రోజుల్లో 6 లక్షలకు చేరుకోనున్నాయి.

 

భారత్‌లో కరోనా వ్యాప్తి రాను రానూ మరింత తీవ్రమవుతుందని, సెప్టెంబర్ నాటికి అది  పతాక స్థాయికి చేరి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20కోట్లకు చేరుతుందని అంచనాలు  వెలువడుతున్నాయి. ఇప్పటిదాకా కాస్తంత సురక్షితంగా ఉన్న పల్లెల్లో ఇక ముందు ఏ మాత్రం అలాంటి  పరిస్థితి ఉండదని, వైద్య సదుపాయాలు పెంచుకోవడమే కరోనా నియంత్రణకు మార్గమని అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. 


 
డిసెంబర్ లో చైనాలో తొలి కరోనా కేసు నమోదయితే...జూన్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల  సంఖ్య కోటికి చేరింది. అంటే అన్ని దేశాల్లో కలిపి కరోనా కేసుల సంఖ్య కోటి కావడానికి ఆరేడునెలల  సమయం పట్టింది. కానీ భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తిపై ఇందుకు భిన్నమైన అంచనాలు  వినపడుతున్నాయి. కేవలం రెండంటే రెండు నెలల్లో దేశంలో కేసుల సంఖ్య 20 కోట్లకు చేరుతుందని  భావిస్తున్నారు. 138 కోట్ల జనాభా ఉన్న దేశంలో 20 కోట్లు తక్కువ సంఖ్యే అయినప్పటికీ...విస్తరణ తీరే  ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇప్పుడు రోజుకు 20వేల లోపులో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ  ఆరోగ్య నిపుణుల విశ్లేషణలు గమనిస్తే...అతి తొందరలోనే రోజుకు 20లక్షలకు పైగా కేసులు నమోదయ్యే  పరిస్థితి కనిపిస్తోంది. అంటే సామాజిక వ్యాప్తితో రానున్న రోజుల్లో భారత్‌లో కరోనా ఎంత తీవ్ర రూపం  దాల్చనుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమయిన ఇటలీ, స్పెయిన్, అమెరికా  వంటి దేశాలతో పోలిస్తే భారత్‌కు జరిగే నష్టం లెక్కించలేనిది. 

 

పట్టణాలతో  పాటు పలెల్లకు... పల్లెలు వైరస్ బారిన పడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంతమందికి కరోనా  చికిత్స అందించే సామర్థ్యం మనదేశానికి లేదు. కాబట్టి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ  కర్తవ్యం భారీ ఎత్తున వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోవడం. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులన్న  తేడాలేకుండా అన్ని చోట్లా కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేయడం. లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకపోయినప్పటికీ  అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. స్వచ్చందంగా గృహ నిర్బంధం పాటించాలి.  వృద్ధులను, చిన్నారులను జాగ్రత్తగా సంరంక్షించుకోవాలి. అలాగే బ్రెజిల్ వంటి దేశాలు కొన్ని నగరాల్లో  అనుసరించిన హెర్డ్ ఇమ్యూనిటీని వీలైనంత తొందరగా పెంచుకోవడం. కరోనాతో సహజీవనం చేస్తూనే హెర్డ్  ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువగా కరోనా టెస్టులు చేయడం,  ఎంతమందికి వైద్యం అవసరం అనేదానిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుండడం ద్వారా వ్యాప్తిని  నియత్రించవచ్చనేది వైద్యుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: