చైనా పైకి చెప్పేదొకటి... వెనకాల చేసేదొకటి. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు... వెనకాల నుండి గోతులు తీస్తోంది. దీంతో డ్రాగన్‌కు గట్టిగా జవాబు చెప్పేందుకు రెడీ అవుతోంది ఇండియా. ముందస్తు జాగ్రత్తగా ఆర్మీ, ఎయిర్‌బేస్‌ల నుంచి భారీగా ఆయుధాలను లడఖ్‌కు తరలిస్తోంది. 

 

భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. శాంతి మంత్రాలను వల్లెవేస్తున్న డ్రాగన్.. చేతల్లో మాత్రం యుద్ధకాంక్షతో రగలిపోతోంది. భారీగా ఆయుధాలు, యుద్ధ విమానాలను తరలింపు చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కార్యకలాపాలు ముమ్మరం చేసింది. గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ట్యాంకర్ విమానం 78 స్కర్దూ స్థావరంలో మోహరించింది.

 

తూర్పు లడఖ్‌‌లో వైమానిక దళం కార్యకలాపాలు చైనా మరింత విస్తృతం చేసింది. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే పీవోకేను వినియోగించుకుని దాడి చేయాలన్నది డ్రాగన్ ప్లాన్‌. కొన్ని రోజులుగా చైనా ఎయిర్‌ఫోర్స్‌ కదలికలు పెరిగాయి. టిబెట్‌లో యుద్ధ విమానాలను సిద్ధం చేసిన చైనా.. అక్కడి నుంచి వాటిని తరలించడం అంత ఈజీ కాదు. దీంతో పీవోకేను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ  స్కర్దూ స్థావరాన్ని యుద్ధ విమానాలకు అనువుగా ఉండేలా పాకిస్థాన్‌ అభివృద్ధి చేసింది. దీంతో ఇక్కడి నుంచే ఎటాక్‌కు ప్లాన్ చేస్తోంది. 

 

చైనా తీరును ముందే పసిగట్టిన భారత్‌...సైన్యంతో పాటు వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది. ఇప్పటికే గాల్వన్‌ లోయ వద్ద భారత యుద్ధ విమానాలు గస్తీ పెంచాయి. తూర్పు లడాఖ్‌లో ఆకాశ్‌ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను మోహరించింది. చైనా విమానాలు ఎల్‌ఏసీ దాటిన వెంటనే ఎటాక్‌ చేసి వాటిని కూల్చేందుకు ఎయిర్‌ ఫోర్స్ సిద్ధంగా ఉంది. 

 

ఇటు..గాల్వాన్‌లో ఘటనలో పక్కా ప్లాన్ ప్రకారమే చైనా కయ్యానికి కాలుదువ్వినట్లు తెలిసింది. కరాటే, కుంగ్‌ఫూలో ఆరితేరిన మార్షల్‌ యోధులు, పర్వత శ్రేణుల్ని ఎక్కే వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. చైనా మీడియానే అధికారికంగా ప్రకటించింది. వీరింతా సరిహద్దుల్లో తనిఖీల పేరుతో ఐదు మిలటరీ బృందాలు జూన్‌15న టిబెట్ రాజధాని లాసాకు చేరుకున్నాయని చైనా మీడియా చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: