ఏపీలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్తగా మరో 793 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 14 వేలకు చేరువవుతోంది. అమెరికా సీడీసీ అధ్యయనం మేరకు ఏపీ సర్కారు మరికొన్ని లక్షణాలను కరోనా లక్షణాల జాబితాలో యాడ్ చేసింది. 

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో 793 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్ర వాసులు 706 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 81మందికి,  విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 30 వేల 216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 793 మందికి పాజిటివ్‌గా  నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13 వేల 891కి చేరింది. గడచిన 24 గంటల్లో 302మంది కరోనా నుంచి కోలుకొని  డిశ్చార్జ్‌ కాగా, 11 మంది  మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 180కి చేరింది. మృతి చెందిన 11 మందిలో కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఇద్దరు,  నెల్లూరులో ఇద్దరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 వేల 479 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం  వంటి లక్షణాలు ఉంటాయని ఇది వరకు నిర్ధారించారు. అయితే ఇప్పుడు కరోనా లక్షణాల్లో మరికొన్ని చేరినట్లు ఏపీ కోవిడ్-19 కమాండ్  కంట్రోల్ రూమ్ పేర్కొంది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని  తెలిపింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్  పేర్కొంది.

 

కరోనా లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని.... ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు, ఛాతిలో నిరంతరం  నొప్పి ఉన్నా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించింది. ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి  లక్షణాలున్నా.. డాక్టర్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలని.. లేకపోతే 104 నంబర్‌కు కాల్ చేయాలని  సూచించింది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: