చింతకాయల అయ్యన్నపాత్రుడు.....తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. యువకుడుగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్న...1983 ఎన్నికల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం బరిలో నిలబడి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వెంటనే జరిగిన 1985 ఎన్నికల్లో కూడా అదిరిపోయే విజయం అందుకున్నారు. అయితే 1989 ఎన్నికల్లో ఓటమి పాలైన అయ్యన్న...1994,1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

 

2009 ఎన్నికల్లో అయ్యన్నకు ఓటమిఎదురైంది. ఇక 2014 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం అయ్యన్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమా శంకర్ గణేశ్ అనూహ్యంగా 21 వేల పైనే మెజారిటీతో అయ్యన్నపై విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఉమా శంకర్ కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

 

ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే శంకర్... అయ్యన్నకు శిష్యుడే. అయ్యన్న ద్వారానే శంకర్ రాజకీయాల్లోకి వచ్చారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడితో కలిసి పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి.. గురువుకే ప్రత్యర్థిగా మారారు. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా దూకుడుగానే పనిచేస్తూ...పదునైన వ్యూహాలతో ముందుకెళుతూ అయ్యన్నకు చెక్ పెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ అయ్యన్న బలం తగ్గిస్తూ, తన బలం పెంచుకుంటూ వెళుతున్నారు.

 

అందులో భాగంగానే నర్సీపట్నంపై గట్టి పట్టున్న అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడుని తనవైపు తిప్పుకున్నారు. అసలు అయ్యన్న విజయాల్లో సన్యాసి పాత్రుడు పాత్ర ఎక్కువ ఉంది. ఇటు అయ్యన్న చుట్టూ అనేక కేసులు వేలాడుతున్నాయి. ఇటీవల నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అనుచితంగా ప్రవర్తించడంతో, అయ్యన్నపై కేసు నమోదైంది. ఇదేగాక ఆయనపై ఇంకా పలు కేసులు ఉన్నాయి.

 

అలాగే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఇష్యూలో కూడా అయ్యన్న పాత్ర ఎక్కువగానే ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఈ పరిణామాలన్నీ అయ్యన్నకు వ్యతిరేకంగా మారాయి, నర్సీపట్నం ప్రజలు కూడా అయ్యన్నపై నమ్మకం కోల్పోయారు. పైగా ఆయన వయసు కూడా అయిపోతుండటంతో యువకుడైన ఉమా శంకర్‌కు గట్టి మద్ధతు ఇస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో కూడా శంకర్ విజయాలకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. ఇక ఇక్కడితోనే అయ్యన్న పోలిటికల్ కెరీర్‌కు చెక్ పడిపోయినట్లు కనబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: