సినిమా హీరోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్...రాజకీయాల్లో మాత్రం స్టార్ కాలేకపోతున్నారు. ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టి, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు సపోర్ట్ ఇచ్చి, 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకుని పోటీకి దిగి ఘోరమైన పరాజయం మూటగట్టుకున్నారు. జనసేన తరుపున ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే, ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.

 

అయితే ఊహించని విధంగా పవన్ రెండుచోట్ల పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. కావాలని తన సామాజికవర్గమైన కాపు ఓట్లు ఎక్కువున్న భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రెండు చోట్ల వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. ఇక ఈ విధంగా రెండు నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగలడంతో పవన్...నెక్స్ట్ ఎన్నికలకు ప్లేస్ మార్చాలని చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

 

ఇప్పటికే ఆయన గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దిగుతారని ప్రచారం జరుగుతుంది. అయితే అలా పవన్ ఈసారి ఖచ్చితంగా గెలిచే సీట్లలో నరసాపురం అసెంబ్లీ ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. నరసాపురం పవన్ సొంత నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. మొగల్తూరు గ్రామం నరసాపురం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుంది. ఇక ఇక్కడ దిగితే పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని జనసైనుకులు భావిస్తున్నారు.

 

అసలు 2019 ఎన్నికల్లోనే ఈయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే విజయం దక్కేదని అంటున్నారు. ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరుపున శెట్టిబలిజ వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ పోటీ చేసి దాదాపు 50 వేలు ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రసాద్ రాజు 55 వేల ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక టీడీపీ అభ్యర్ధి బండారు మాధవనాయుడుకు 27 వేలు ఓట్లే వచ్చాయి.

 

అందుకే 2019 ఎన్నికల్లో ఇక్కడ పవన్ పోటీ చేసి ఉంటే గెలిచి ఎమ్మెల్యే అయ్యేవారని, అయితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచే పోటీకి దిగి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, ఇది ఫిక్స్ అని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే ఇక వైసీపీకి చుక్కలే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: