పైకి చెప్పకపోయినా, టిడిపి జనసేన బంధం ఎలా ఉంటుందో రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాలను ఫాలో అవుతున్న వారు ఎవరిని అడిగినా చెబుతారు. ఈ రెండు వేరు వేరు పార్టీలైన, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ఒక అంగీకారంతో ముందుకు వెళ్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఒప్పుకోరు. ఇదిలా ఉంటే జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో సంచలన ఆరోపణలు చేస్తూ, టిడిపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇక ఆ తర్వాత నాగబాబు వ్యాఖ్యలకు జనసేన కు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ జనసేన పార్టీ వెల్లడించింది. 

 

IHG


ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ నాగబాబు టిడిపి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ అనుకూల మీడియాపైన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం విలువలు పడిపోయాయి అని, దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మీడియాను వాడుకుంటున్నారని, అది ఇప్పుడు పెద్ద వృక్షంలా మారిందని నాగబాబు ఆరోపించారు. చంద్రబాబు ఏం చేసినా, ఆ ఎల్లో మీడియా ఆయనకు భజన చేస్తుందని, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలు అంటూ కొన్ని మీడియా చానళ్లను ఉద్దేశించి నాగబాబు విమర్శించారు. 

IHG


కొన్ని తెలుగు వార్తా చానల్స్ ని చూస్తే ముచ్చటేస్తుంది అని, చంద్రబాబు ఉప్పు తిని ఆయనకు విశ్వాసంగా పనిచేస్తున్నాయని నాగబాబు విమర్శించారు. ఈ సందర్భంగా వైసిపి అధినేత జగన్ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం కొన్ని మీడియా ఛానళ్ల వ్యవహారం చూస్తుంటే వీరికి జగన్ కరెక్టని తప్పుడు వార్తలపై జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని, ఇలా చేయకపోతే వీరంతా మరింతగా రెచ్చిపోతారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. కాకపోతే తన వ్యాఖ్యలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, తాను వ్యక్తిగతంగానే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నా అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. 

 

కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి బృందం కలిసిన సందర్భంలో, అమరావతి రాజధాని రైతుల పేరుతో కొంతమంది హడావుడి చేయడం, చిరంజీవిని విమర్శించడం, ఆ తరువాత టీడీపీ అనుకూల మీడియా దీనిపై పెద్ద రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయడం వంటి పరిణామాలపై అప్పట్లోనే నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఘాటుగా టీడీపీపై విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి ఇంటర్వ్యూలో ఈ విధంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే జనసేన పార్టీలోనే నాగబాబు ఉన్నా, ఆ పార్టీ విధానాలు ఆయనకు నచ్చడం లేదని, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: