చైనాతో తాడో పేడో తేల్చుకునేందుకు భార‌త్‌సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను, దురాక్ర‌మ‌ణ‌ల‌ను ఎంత‌మాత్రం స‌హించ‌బోమ‌న్న సంకేతాల‌ను భార‌త్ నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే డ్రాగ‌న్ యుద్దానికే సిద్ధం అన్న‌ట్లుగా స‌రిహ‌ద్దులు దాటుతూ భార‌త్‌లోకి చొచ్చుకురావ‌డం గ‌మ‌నార్హం. చైనా సరిహద్దులో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సరిహద్దులో బలగాల సంఖ్యను పెంచడంతో పాటు అస్త్రశస్త్రాలను తరలిస్తోంది. అత్యవసరమైన యుద్ధ ప‌రిక‌రాల‌కు కొనుగోలుకు స‌న్న‌ద్ధ‌మైంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలను త్వరగా తెప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

 


కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో రెండు నెలలు ఆలస్యమైన జెట్లు.. జూలై చివరి నాటికి భారత్‌కు ఫ్రాన్స్ అందించనుంద‌ని తెలుస్తోంది. నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు అందించనున్నట్లు.. అందులో మూడు రెండు సీట్ల విమానాలు, ఒకటి సింగిల్ సీటర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంబాలా ఎయిర్‌బేస్‌కు ఈ విమానాలు రానున్నాయి. ఈ యుద్ధ విమానాల కొనుగోలులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బదౌరియాకు సముచిత గౌరవం ఇవ్వనున్నారు. జులై 27 నాటికి అత్యాధునిక క్షిపణులను అమర్చిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లెక్క ప్రకారం నాలుగు విమానాలు రావాల్సి ఉండగా.. అయితే ఇప్పుడు  భారత్‌ మొత్తం ఆరు విమానాలను ఇవ్వాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది.

 


2016 సెప్టెంబర్‌లో భారత్ ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ సేకరణకు సంబంధించి అంతర్ ప్రభుత్వ ఒప్పందం కుదిరింది. ఈ కొనుగోళ్ల ఒప్పంద విలువ రూ 58000 కోట్లు. ఒప్పందం విలువ, దళారీల పాత్ర గురించి పలు వివాదాలు తలెత్తాయి. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. భారతీయ వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేపట్టారు. మొత్తం 36 రాఫెల్స్‌లో 30 ఫైటర్ జెట్స్ కాగా ఆరు శిక్షణ విమానాలు. పూర్తి స్థాయిలో ఫైటర్ జెట్స్‌నుపోలి ఉండే ఇవి రెండు సీట్లతో అమరి ఉండి, యుద్ధ విమానాల పైలెట్లకు శిక్షణకు ఉపయోగపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: