సికింద్రాబాద్ ఎమ్మెల్యే,రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల.పద్మారావుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.ఆయన కుమారుడికి కూడా వైరస్ పోకినట్లు తేలింది. మిగ‌తా కుటుంబసభ్యులకు నెగిటివ్ రాగా, వారంతా హోం క్వరంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే డిప్యూటీ స్పీకర్‌కు సైతం కరోనా అని తేల‌డం గ‌మ‌నార్హం. క‌రోనా లక్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆదివారం నుంచే పద్మారావు గౌడ్ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


డిప్యూటీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో వ‌రుస‌గా ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇటు టీఆర్ ఎస్ అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,రాష్ట్ర స్థాయినేత‌లను మ‌హ‌మ్మారి క‌బ‌ళిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు.

 

కరోనా సడలింపులు ఇచ్చినప్పటి నుండి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు రోజుకు 1000 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంఎల్ఏ లకు కూడా ఈ వైరస్  సోకుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 15,394 కరోనా కేసులు నమోదుకాగా 253  మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. ఇదిలా ఉండ‌గా హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అధికారులు ధ్రువీక‌రించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: