జీహెచ్ఎంసీ ప‌రిధిలో  మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌ దాని పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమైనట్టు ఇప్ప‌టికే సంకేతాలిచ్చింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. 
ఒకవేళ లాక్‌డౌన్‌ విధించి కఠిన నిబంధనలు అమలు చేయాలనుకున్న పక్షంలో పగటిపూట రెండు లేదా మూడు గంటలు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతించి రోజంతా కర్ఫ్యూ అమలు చేస్తారన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ​ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే ఇబ్బందుల నుంచి త‌ప్పించుకున్న వార‌వుతార‌ని ప్ర‌భుత్వ అధికారులు సూచిస్తున్నారు.  

 

గ‌త అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రజలు సరైన ప్రణాళిక రూపొందించుకోవడం మంచిదని చెబుతున్నారు. తద్వారా ఈ సమయంలో వీలైనంత వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండవచ్చు. 15 రోజులకు సరిపడా కిరాణా, ఇతర నిత్యావసరాలను ముందే కొనిపెట్టుకోవ‌డం వ‌ల‌న బ‌య‌ట‌కు వెళ్లే అవ‌స‌రం త‌ప్పుతుంద‌ని చెబుతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ఎన్ని రోజులు వస్తుందో సరిచూసుకుని.. ముందుగానే నిల్వ ఉంచుకోవాలని చెబుతున్నారు. చిన్నపిల్లలకు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రిని ముందే తెచ్చిపెట్టుకోవాల‌ని సూచిస్తున్నారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోవద్దని హిత‌వు ప‌లుకుతున్నారు.

 

ఇదిలా ఉండ‌గా తెలంగాణలో పలుచోట్ల స్వచ్ఛందంగా వ్యాపారులు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఎర్రగడ్డ రైతు బజార్‌లో రెండు రోజులుగా అదే చేస్తున్నారు. అల్వాల్‌లో నేటి నుంచి వచ్చేనెల 6 వరకు లాక్‌డౌన్ పాటించాల‌ని అక్క‌డి వ్యాపారులు తీర్మానించుకున్నారు.  బేగంబజార్‌లో ఇటీవల 20 మందికి పైగా కరోనా సోకడంతో ఇప్పటికే అక్కడ వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు, కరోనా ఉద్ధృతంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచే బంద్ పాటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: