తమిళనాడు కస్టోడియల్ డెత్‌ వివాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ నిబంధనల పేరుతో తండ్రీకొడుల చావుకు కారణమైన పోలీసులు ఎఫ్ఐఆర్ లో పచ్చి అబద్దాలు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాలకు పోలీసు చెబుతున్న దానికి పొంతనే లేదు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించింది.  

 

తమిళనాడులోని టుటుకోరిన్ జిల్లా సంతన్‌కులంలో పోలీసుల అమానుష చర్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహానికి కారణమైంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో జయరాజ్, ఫినెక్స్ అనే తండ్రీకొడుకులను టుటుకోరిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు పోలీసు కస్టడీలో వాళ్లు చనిపోయారు. పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టడం వల్లే వాళ్లు చనిపోయినట్టు విమర్శలొచ్చాయి. 

 

షాపు మూసివేయలాని చెబితే వినలేదని...పైగా కొంతమంది తమ విధులకు అడ్డుతగిలారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో పోలీసులు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలనేని సీసీటీవీ దృశ్యాల్లో తేలిపోయింది. పోలీసులతో గొడవ పడినట్టు గానీ, బెదిరించినట్టుగానీ సీసీటీవీలో లేదు. పైగా జయరాజ్ , ఫెనిక్స్ ఇద్దరూ పోలీసు వాహనం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. షాపు ముందు ఘర్షణ జరిగిన వాతావరణమే కనిపించలేదు. తమ అకృత్యాలు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 

తండ్రీకొడుకుల మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ పై నిరసనలు చెలరేగుతున్నాయి. పోలీసుల హింసాకాండను నిరసిస్తూ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులు ఎవరైనా వదిలి పెట్టకూడదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: