టిక్‌టాక్ సహా తమ దేశానికి చెందిన మొబైల్ యాప్స్‌ను నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడిదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందంటోంది. మరోవైపు టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడంతో కేంద్ర ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చలకు సిద్ధమైంది. చైనాతో సహా ఏ దేశానికి భారతీయుల డేటాను లీక్ చేయలేదని ప్రకటించింది.

 

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూ కయ్యానికి కాలుదువుతున్న చైనా... మొబైల్ యాప్స్‌ నిషేధాన్ని తప్పుపడుతోంది. అంతర్జాతీయ చట్టాలతో పాటు స్థానికంగా ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగానే తమ దేశానికి చెందిన సంస్థలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని ప్రకటించింది. టిక్‌ టాక్ సహా 59 మొబైల్ యాప్స్‌ను నిషేధం విధించడం తమను ఆశ్చర్యపరిచిందని చైనా విదేశాంగ శాఖ చెబుతోంది. 

 

మరోవైపు చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారుల గోప్యత, భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. చైనా సహా ఏ ప్రభుత్వానికీ డేటా లీక్ చేయలేదని టిక్‌టాక్ ఇండియా ప్రకటించింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామని టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. టిక్‌టాక్‌పై నిషేధం తాత్కాలికంగానే ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

 

మరోవైపు టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌ నుంచి తొలగించాయి. ఇకపై ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లకు లేఖ రాస్తే... ఇప్పటికే మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న టిక్‌టాక్ యాప్‌ కూడా ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే అవకాశముంది. మొత్తానికి భారత్.. చైనా యాప్స్ నిషేధించడంపై ఆ దేశం స్పందించింది. పెట్టుబడి దారులను దృష్టిలో పెట్టుకొని భారత్ సహకరించాలని కోరుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: