గతకొంతకాలంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన రఘు...సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ఈ విషయాన్ని చెప్పాలనుకుంటే సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదని హడావిడి చేశారు. ఇక ఎంపీకి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నారు. అయితే ఈ విషయం షోకాజ్ నోటీస్ వచ్చేవరకు వచ్చింది.

 

ఇక దానిపై కూడా రఘు లాజిక్‌లు పట్టకుంటూ వైసీపీని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు. అయితే ఈ రచ్చ ఎంతకాలం జరుగుతుందో చెప్పలేని పరిస్తితి ఉంది. కాబట్టి ఈవిషయాన్ని కాసేపు పక్కనబెట్టేస్తే...రఘు వైసీపీకి దూరమైపోయి, బీజేపీకి దగ్గరైపోయారని టాక్ వచ్చేసింది. ఈ క్రమంలోనే రఘు స్థానంలో నరసాపురం బరిలో జగన్ కొత్త నాయకుడుని దించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఎన్నికల ముందు పార్టీలో చేరిన గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు నరసాపురం బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కానీ ఊహించని విధంగా వెస్ట్‌లో మంచి పేరున్న టీడీపీ సీనియర్ నేత వేటుకూరి వెంకట శివరామరాజు(కలవపూడి శివ)ని వైసీపీలోకి తీసుకొచ్చి, నెక్స్ట్ నరసాపురం బరిలో దించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కలవపూడి శివ ఉండి అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మొన్న ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీచేసి రఘు చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఈయన సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇదే క్రమంలో ఆయన వ్యాపారాలకు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శివ వైసీపీలోకి తీసుకురావాలని వెస్ట్ వైసీపీ పెద్దలు చూస్తున్నట్లు సమాచారం. శివ వైసీపీలోకి వస్తే ఒకేసారి రఘు, చంద్రబాబులకు చెక్ పెట్టినట్లు ఉంటుందని చెబుతున్నారు. మరి చూడాలి శివ వైసీపీలోకి వెళ్లతారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: