కరోనాకు వారు, వీరు, ధనిక, పేద, నాయకుడు, సామాన్యుడు ఇలా బేధం ఏమి లేదు. అజాగ్రత్తగా ఎవరు ఉన్నా, కాటు వేసేందుకు కాచుకుని కూర్చుంటుంది. ఇప్పటికే కరోనా కారణంగా, దేశమంతా అతలాకుతలమవుతోంది. ఈ ప్రభావం అప్పుడే వదిలేది కాదు అని, జూలైలో మూడు రెట్లు పెరుగుతుందని, వైద్యరంగ నిపుణులు హెచ్చరికలు చేయగా, నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం జూలైలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కారణంగా, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అన్ లాక్ 1.0 లో చాలా నిర్లక్ష్యం వహించారని, 2.0 ఆ నిర్లక్ష్యాన్ని వీడాలని ప్రధాని నరేంద్ర మోడీ సైతం గట్టిగానే హెచ్చరించారు. కానీ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ వారిని, కరోనా నుంచి కాపాడే విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కరోనా బాధితులుగా , కరోనా కారకులుగా తయారవడం ఆందోళన కలిగిస్తోంది. 

 

IHG


తెలంగాణలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ కి కరోనా సోకింది. దీనికి కారణం ఆయన స్వయంకృతపరాధమేననే చర్చ మొదలైంది. అలాగే తెలంగాణ మంత్రి పద్మారావు, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు, 7 ,8 మంది ఐపీఎస్, ఐఏఎస్ లు, ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. పడుతున్నారు. ఏపీలోనూ ప్రజాప్రతినిధులు ఎవరూ సామాజిక దూరం పాటించకుండా, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. మీటింగులు, సమావేశాలు అంటూ హడావుడి చేస్తున్నారు. ఎక్కడా కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. 


మాస్కు పెట్టుకోకపోవడం, శానిటైజర్, గ్లౌజులు వాడకపోవడం, గుంపులు గుంపులుగా అనుచరులతో హడావుడి చేయడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రజాప్రతినిధులు వీటి బారిన పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు గన్ మాన్ లు, పీఏ లు ఇలా అందరూ కరోనా కాటుకు గురవుతున్నారు. దీనంతటికీ వారి నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు చాలామంది కరోనాను అంటించుకోవడమే కాకుండా, జనాలకు కూడా అంటించే పనిలో ఉన్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. కరోనా గురించి జాగ్రత్తలు చెప్పడమే కాదు, వాటిని పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు ముందు మరింత దారుణంగా పరిస్థితి తయారవుతుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: