జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ పార్టీ అధినేతపైన, పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ మీద కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అనేక సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ మనస్తత్వాల గురించి కూడా ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. చిరంజీవి అందరూ కావాలి అనుకునే వ్యక్తి అని, కానీ పవన్ అలా కాదని, ఎవరిని దగ్గరకు చేరనివ్వరని, రాజకీయాల్లో జగన్ లా ఉండాలని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ విషయంలో జగన్ చూసి, పవన్ నేర్చుకోవాలని, ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పవన్ ను నాదెండ్ల మనోహర్ తప్పుదోవ పట్టిస్తున్నారని, దిండి లో జరిగిన పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని, అయినా అక్కడకు వెళ్ళిన తనను పవన్ ముందే నాదెండ్ల మనోహర్ బొట్టు పెట్టి పిలవరు కదా అంటూ అవమానించారని,అప్పుడు పక్కనే ఉన్న పవన్ కనీసం ఖండించలేదు అని, ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు.

 

IHG

 జనసేన పార్టీ లో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని, నాదెండ్ల మనోహర్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా రాపాక విమర్శలు చేశారు. తాను పార్టీకి దూరం అవ్వలేదు అని, ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యే గా ఉన్నాను అని, అయినా తనకు పార్టీ కార్యక్రమాల గురించి కానీ, మరి ఈ విషయాల గురించి గాని, సమాచారం ఇవ్వడం లేదని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల సమస్యల కంటే వ్యక్తిగత సమస్యల కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే తాను ప్రజల సమస్యలపై చర్చించాలని అనుకుంటున్నానని, అయినా కుదరడం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు.


 రాపాక చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా అని విశ్లేషిస్తే, అనేక సంచలన విషయాలు బయట పడుతున్నాయి. నాలుగు నెలలుగా పవన్ ఏపీ పర్యటించనేలేదు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు బాధితులను పరామర్శిస్తాను అని చెప్పినా, ఇప్పటి వరకు ఆయన వెళ్లలేదు అని, అలాగే అమరావతి ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పినా, అక్కడకు కూడా ఆయన వెళ్లేందుకు బయటకి రావడంలేదు. అలాగే అమరావతి రైతుల బాధలు అంటూ హడావుడి చేసినా, ఆ సమస్య గురించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. 


ఇక జనసేన ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాకను పూర్తిగా జనసేన పార్టీ పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు, పవన్ సామాజికవర్గానికి చెందిన నాయకులకు రాపాకను పట్టించుకోవద్దనే సూచనలు అందినట్లుగా రాపాక వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. రాపాక ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఇప్పటి వరకు జనసేన నుంచి కనీస స్పందన లేకపోవడంతో, ఆయన చెబుతున్న దాంట్లో నిజాలు ఉండే ఉంటాయనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: