ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్ మాదిరిగా భారత్ లో అడుగుపెట్టిన టిక్ టాక్ మొబైల్ యాప్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ యాప్ వచ్చిన అతి కొద్దికాలంలోనే బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ టిక్ టాక్ ద్వారా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఎంతోమంది నిజంగానే ఈ టిక్ టాక్ యాప్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఎంతోమంది ఈ యాప్ ద్వారా తమలోని దాగి ఉన్న నటనను బయటపెట్టుకున్నారు. ఎంతో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి కొంతమంది సినిమా అవకాశాలు కూడా దక్కించుకోగలిగారు. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వారు వేలల్లో ఉండగా, ఇదే యాప్ ద్వారా బాగా డబ్బులు సంపాదించుకున్న వారు ఎక్కువగానే ఉన్నారు.

IHG


 చిన్న స్టార్ నుంచి పెద్ద స్టార్ వరకు ప్రతి ఒక్కరూ ఈ టిక్ టాక్ ను ఉపయోగించుకుని తమ సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకుంటూ, ప్రచారానికి వాడుకుంటూ జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదంతా నాణానికి ఒక వైపు. టిక్ టాక్ ద్వారా లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నట్టు కనిపించాయి. చాలామంది ఈ యాప్ ను దుర్వినియోగం చేశారనే  అభిప్రాయం లేకపోలేదు. ఈ టిక్ టాక్ యాప్ వల్ల ఎన్నో వేల కుటుంబాలు నాశనం అయ్యాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ఫలితంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భ్రష్టుపట్టాయి అనే అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి.

 


 కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూడా ఈ టిక్ టాక్ ను బ్యాన్ చేయాలంటూ ఉద్యమాలు చేపట్టాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై కేంద్రం కూడా పెద్దగా స్పందించలేదు. కానీ కొద్ది రోజులుగా చైనాతో భారత్ కు వివాదం ఏర్పడడంతో, చైనా ను ఆర్థికంగా దెబ్బ తీసే ఆలోచన లో భాగంగా టిక్ టాక్ తో సహా మరో యాభై తొమ్మిది యాప్స్ ను బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్లే స్టోర్ తదితర వాటి నుంచి ఈ యాప్స్ ను తొలగించడం జరిగింది. టిక్ టాక్ తో పాటు భారత్ లో బాగా పాపులరైన హలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్, షేర్ ఇట్, క్యాం స్కానర్ యాప్స్ కూడా బ్యాన్ అయ్యాయి. 

 

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మెజారిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఈ యాప్ ను తొలగించడం సరికాదంటూ, కేంద్రం తీరుని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఏది ఏమైనా చైనా దెబ్బ కొట్టే విషయంలో, టిక్ టాక్ తో పాటు మిగతా చైనా యాప్స్ ని నిషేధించడం మాత్రం అభినందించాల్సిన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: