దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే వైరస్ సోకినా భయపడాల్సిన అవసరం లేదని... దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు సైతం వైరస్ నుంచి కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకినా తగిన జాగ్రత్తలు పాటిస్తే కోలుకోవడం సాధ్యమేనని.... భయాందోళనకు గురి కావద్దని వైద్యులు సూచిస్తున్నారు. 
 
తాజాగా 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ కాగా అతనికి గుండెజబ్బు, రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్నాయి. ఆ వ్యక్తి కొన్ని నెలల నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. అయినా వైరస్ ను జయించి కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు. 14 రోజుల్లోపే ఆ వ్యక్తిలో వైరస్ లక్షణాలు తగ్గిపోయినా 28 రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని వైద్యులు వైరస్ పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న తరువాత ఇంటికి పంపించారు. 
 
వైరస్ భారీన పడిన వారిలో 92 శాతం మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనా సోకిన వారిలో 94 శాతం మంది డయాబెటిస్ రోగులు, 89 శాతం మంది బీపీ బాధితులు క్షేమంగా ఇంటికి వెళ్లారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కరోనా భారీన పడినంత మాత్రాన మరణం తథ్యం అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని..... తాజా పండ్లు, కూరగాయలు తినాలని..... ధూమపానం, మద్యపానంలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

 
వైద్యులు కరోనా సోకిన వాళ్లు మానసికంగా ధృడంగా ఉండాలని ఆందోళనకు గురి కావద్దని.... ముందస్తు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులను సంప్రదించి తగిన ఔషధాలను తీసుకుంటే వైరస్ ను జయించడం సాధ్యమేనని వాళ్లు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: