గత కొన్నిరోజులుగా ఏపీలో రేషనలైజేషన్ ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల టీచర్‌ పోస్టులు మాయమయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 15 వేలు, ఉన్నత పాఠశాలల్లో 12 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు నుంచి మూడు వేల వరకు పోస్టులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 
రాష్ట్రంలో టీచర్ల పోస్టులు తగ్గితే భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. 2020 ఫిబ్రవరిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టబోతుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఇకపై సింగిల్‌ టీచర్‌లు ఉండరని, కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. 1 : 30 ప్రకారమే టీచర్ల పోస్టులను ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 
 
కానీ 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. గతంలో . 80 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక స్కూళ్లలో ప్రస్తుతం 5 పోస్టులు ఉండగా తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై మూడు పోస్టులే ఉండనున్నాయి. ఇకపై 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటేనే హెడ్మాస్టర్ పోస్టును ప్రభుత్వం మంజూరు చేయనుంది. గతంలో 500 విద్యార్థులు దాటిన చోట రెండవ హెచ్‌ఎం పోస్టు ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఒకే పోస్టుకు కుదించింది. 
 
ప్రతి మండలానికో తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం తాజా లెక్కల్లో ఈ పోస్టుల గురించి స్పష్టత ఇవ్వలేదు. తాజా ప్రతిపాదనల వల్ల టీచర్‌ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉన్నందువల్ల రేషనలైజేషన్ ను వాయిదా వేయాలని చెబుతున్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత నెలరోజుల పాటు అడ్మిషన్లకు గడువు ఇచ్చి అనంతరం రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని వారు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: