అన్ లాక్ 2.0 నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌సంగించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రేష‌న్ స‌రుకులు పేద‌ల‌కు అందించ‌డంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై జ‌న‌సేనా పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పం‌దించారు. కరోనా విపత్కర సమయంలో ఇక్కట్లలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకొనే క్రమంలో ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కార్యక్రమాన్ని నవంబర్ వరకూ కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమ‌ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది నిరుపేదలకు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఉచితంగా అందించడం వల్ల ఆయా వర్గాల ప్రజలకు జీవితంపై ఒక భరోసా కలుగుతుందని ప‌వ‌న్ విశ్లేషించారు.

 

ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే పేదల బాధలు తెలియాలని పేర్కొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టే ఈ కార్యక్రమం కోసం రూ.1.50 లక్షల కోట్లు నిధులు వెచ్చిస్తోందని విశ్లేషించారు. లాక్ డౌన్‌తో దేశం అంతా కష్ట కాలంలో ఉన్న తరుణంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 20 లక్షల మంది నిరుపేదలకు, 9 కోట్లమంది రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామని మోదీ వెల్లడించారని వివ‌రించారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికపరమైన ఒడిదొడుకుల్లో ఉన్నా – దేశానికి వెన్నెముక రైతు, దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా కీలకం అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రం సముచితంగా రైతులకు, పేద వర్గాలకు ఆర్థిక భరోసా ఇవ్వగలిగిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కితాబు ఇచ్చారు. కోవిడ్-19 వల్ల తలెత్తిన పరిస్థితులను, ఆ విపత్కర తరుణంలో తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఉపయుక్తం అయ్యాయని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల శాతం తక్కువగా ఉంది. పేద ప్రజలకు, రైతాంగానికి అండనిస్తున్న ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని ప‌వ‌న్ తెలిపారు. 

 


ఈ సందర్భంలోనే ప్రధానమంత్రి అన్ లాక్ -1 తరవాత నియమ నిబంధనలు, ఆరోగ్యపరమైన ముందస్తు జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్య ధోరణి పెరిగిందని ఆందోళన చెందిన విషయాన్ని అందరం గుర్తించాలని ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. సీజనల్ వ్యాధులు వచ్చే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో ఎంత అప్రమత్తతతో ఉన్నామో అదే విధంగా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఒక దేశ ప్రధాని మాస్క్ ధరించకపోతే జరిమానా విధించిన విషయాన్ని మోదీ ప్రస్తావించిన అంశాన్ని అందరం పరిగణనలోకి తీసుకోవాల‌ని అన్నారు. కరోనా జాగ్రత్తల విషయంలో ఎస్ (శానిటైజర్). ఎమ్ (మాస్క్). ఎస్ (సోషల్ డిస్టెన్స్). సూత్రాన్ని అనుసరించాలని వైద్యులు చెబుతున్నార‌న్న ప‌వ‌న్‌ ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను పాటించాలని కోరారు. నియమ నిబంధనల అమలులో అధికారులు కఠినంగా వ్యవహరించాలి... అందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ నిబంధనలు అన్నీ మన క్షేమం కోసమే అని గ్రహించాలని పేర్కొంటూ జైహింద్ అని ముగించారు. కాగా, బీజేపీ నేత‌ల కంటే గొప్ప‌గా ప‌వ‌న్ మోదీ ప్ర‌సంగాన్ని వివ్లేషించార‌ని ప‌లువురు పే‌ర్కొంటున్నారు. మంచి మంచి అన‌డంలో మా నాయ‌కుడికి బేష‌జాలు ఉంండ‌వ‌ని జ‌న‌సేన పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: