తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. రానున్న రెండు నెలల్లో కేసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో కరోనాను ఎదుర్కోడానికి సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది ప్రభుత్వం. 

 

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డూ-అదుపూ లేకుండా పోతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో రోజూ దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కోడానికి సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్‌. 

 

కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లను ఎంత తొందరగా గుర్తిస్తే అంత సమర్థవంతంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి జర్వ పరీక్షలను మరింత పెంచాలని అధికారుల్ని ఆదేశించింది. పాజిటివ్ వచ్చిన వాళ్లలో లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండేలా చూడాలని సూచించింది. జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో నిఘా పెంచాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం.

 

కరోనా కేసులు పెరుగుతుండడంతో లక్షణాలున్న వాళ్లు పరీక్షల కోసం ముందుకొస్తన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11 సెంటర్లలో నమూనాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ల్యాబ్‌లలోనూ కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పారదర్శకంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు ఐసీఎమ్ ఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. 

 

కరోనా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ -టిమ్స్‌ తో పాటు గాంధీ ఆస్పత్రికి అవసరమైన అదనపు సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టర్షరీ కేర్ ఆస్పత్రి వరకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  

 

కరోనా లక్షణాలు ఉన్న వాళ్లకు పరీక్షలు చేయడంతో పాటు క్లస్టర్‌ జోన్లలో ఇంటింటి సర్వే చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. అలాగే, కరోనా పాజిటీవ్‌ వచ్చినా... వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న వాళ్లకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించడం ద్వారా ఆస్పత్రులపై ఒత్తిడి పెరగకుండా చూడాలన్నది ప్రభుత్వ వ్యూహం. గతంతో పోలిస్తే కరోనాపై జనంలో అవగాహనపెరిగి. లక్షణాలు ఉన్నవాళ్లు పరీక్షలకు ముందుకొస్తున్నారు. దీంతో త్వరలో కరోనా వైరస్‌ వ్యాప్తిని త్వరలోనే కట్టడి చేయగలమంటోంది ప్రభుత్వ యంత్రాంగం. 

మరింత సమాచారం తెలుసుకోండి: