దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన 108 అంబులెన్స్‌ సర్వీసులను జగన్‌ సర్కార్‌ పునరుద్ధరించింది. ఒకేసారి వెయ్యి 88 అత్యాధునిక అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. అంబులెన్స్ సిబ్బందికి జీతాలు పెంచి శుభవార్త చెప్పారు. 


 
విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతం కుయ్‌..కుయ్‌.. శబ్ధం మారుమోగింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని గుర్తుకు తెస్తూ.. ఆయన మానసపుత్రిక కార్యక్రమం 108, 104 అంబులెన్స్‌లను ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు. ఏపీలో  వెయ్యి 88 అంబులెన్స్‌లు ఇకపై ఆపద సమయాల్లో రోడ్లపై సేవలందించనున్నారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత సీఎం‌ ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా ప్రత్యక్షంగా ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే మొదటి సారి.

 

వాహనాలను ఆధునీకరించటమే కాకుండా 108 సిబ్బందికి శుభవార్తను అందించారు సీఎం. సిబ్బంది జీతాలను భారీగా పెంచారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. 

 

బీఎల్‌ఎస్‌ అంబులెన్సుల్లో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరాలనేది ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

203 కోట్లతో మొత్తం 412 కొత్త వాహనాలు, మిగిలినవి పాత వాహనాలకు ఆధునీకరించి 1088 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. వీటిలో 104 వాహనాలు బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌వి కాగా, 282 అంబులెన్స్‌లు అడ్వాన్సడ్‌ లైఫ్‌ సపోర్ట్‌ అందించేవి. ఇవి కాకుండా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 26 అంబులెన్స్‌లను సిద్ధం చేసింది. డాక్టర్‌తో సహా ఐదుగురు సిబ్బంది, అవసరమైతే స్పాట్‌లో వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల సరఫరా చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: