తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేయడంలో ముందు ఉండే కాంగ్రెస్ పార్టీ నేత‌, ఎంపీ ‌రేవంత్ రెడ్డి తాజాగా అదే రీతిలో మ‌రోమారు టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిపై జోక్యం చేసుకోవాల‌ని ప్ర‌ధానమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైర‌స్ ఉధృతి పెరిగిపోతుంద‌ని, దేశంలోనే అత్య‌ధిక పాజిటివ్ రేటుతో హైద‌రాబాద్ రాబోయే రోజుల్లో క‌రోనా హాట్ స్పాట్ కాబోతున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్ర‌ధానికి లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను, హైకోర్టు ఆదేశాల‌ను, ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పెడ‌చెవిన పెడుతుంద‌ని రేవంత్ లేఖ‌లో ప్ర‌స్తావించారు. దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో ఒక‌టైన హైద‌రాబాద్ ప‌రిస్థితి దారుణంగా మారబోతుంద‌ని, వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని రేవంత్ రెడ్డి కోరారు. 

 

దేశంలోనే అత్య‌ధిక కేసులున్న మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ రేటు 22శాతం ఉంటే, తెలంగాణ‌లో 27శాతం ఉంద‌ని ప్ర‌ధాని దృష్టికి రేవంత్ రెడ్డి తెచ్చారు. దేశ, విదేశాల‌కు హైద‌రాబాద్ నుండి ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, తద్వారా ఇన్ఫెక్ష‌న్ రేటు కూడా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌సత్వం కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70వేల టెస్టులు మాత్ర‌మే జ‌రిగాయ‌ని, అదే ప‌క్క‌నున్న ఏపీలో 6ల‌క్ష‌ల వ‌ర‌కు టెస్టులు చేసిన‌ట్లు ప్ర‌ధానికి వివ‌రించారు. ఇక గ‌త నాలుగు రోజులుగా ల్యాబుల‌పై ఒత్తిడి పెరిగిపోయింద‌ని చెబుతూ అస‌లు టెస్టులే చేయ‌లేద‌ని, ఎక్కువ‌గా టెస్టులు చేయాల్సిన చోట చేయ‌టం లేద‌ని రేవంత్ లేఖ‌లో ఆరోపించారు. చేసిన టెస్టుల‌కు సైతం రిజ‌ల్ట్ ఆల‌స్యం అవుతుంద‌ని... ఈలోపు వ్యాధి  ముదిరి, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంద‌న్నారు. ఏపీలో 42 ట్రూనాట్ కిట్స్ ఉంటే తెలంగాణ‌లో కేవ‌లం 22 మాత్ర‌మే ఉన్నాయ‌ని, కేవ‌లం ఒకే ఒక్క సెంట్ర‌ల్ ల్యాబు ఉంద‌న్నారు. ఇక టిమ్స్ ఆసుప‌త్రి అలంకారప్రాయంగా మాత్ర‌మే ఉంద‌ని, కోవిడ్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా ఉన్న గాంధీలో తీవ్ర స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. మెడిక‌ల్ వేస్ట్ కుప్ప‌లుగా పెరుక‌పోయింద‌ని మాన‌వ హ‌క్కుల సంఘం సుమోటోగా కేసును విచారిస్తున్న‌ట్లు ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు.

 

హైద‌రాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎన్నో ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీలు ఉన్న‌ప్ప‌టికీ క‌రోనాపై పోరులో వాటిని వాడుకోవ‌టం లేద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వెంట‌నే వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనాపై పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కార్పోరేటు ఆసుప‌త్రుల్లో చేరి వైద్యం పొంద‌లేని నిరుపేద‌ల‌కు క్వారెంటైన్, చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి అ‌న్నారు. కానీ చాలా వ‌ర‌కు ఇవి సీఎం కేసీఆర్ బంధువులు, మంత్రులు, వారి బంధువుల‌కు చెంద‌టంతో వాటిని ఉప‌యోగించుకోవ‌టం లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌ధానికి రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: