స‌రిహ‌ద్దుల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న‌  చైనాకు దిమ్మ‌తిరిగి పోయే షాకిచ్చే ఆ దేశ కంపెనీలకు చెందిన 59  యాప్‌లపై భారత ప్రభుత్వం సోమవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. మన దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 59 చైనీస్ యాప్‌లపై  విధించిన నిషేధం చైనాను కలవరపెడుతోంది. దీంతో ఆ దేశానికి చెందిన ప్రముఖులు ఆన్‌లైన్‌లో విమర్శలకు దిగుతూ త‌మ బుద్ధిని చాటుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో వారికి ఊహించ‌ని షాక్ త‌గ‌లింది. తాజాగా ప్రధాని  నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా దేశీయ పారిశ్రామిక దిగ్గ‌జం ఆనంద్ మహీంద్రా సైతం చైనాకు ఘాటు షాకిచ్చారు. 

 

ముందుగా ప్ర‌ధాని మోదీ కీల‌క నిర్ణ‌యం గురించి చూస్తే చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'వైబో' నుంచి మోదీ తప్పుకున్నారు. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన  ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను  చాలా మంది చైనీయులు వినియోగిస్తున్నారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు 2015లో మోదీ వైబోలో అకౌంట్‌ తెరిచారు. 'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో  మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని మోదీ తొలి పోస్ట్ చేశారు. వైబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఎక్కువమంది చైనీయులే.  2015 నుంచి చైనాకు సంబంధించిన  విషయాలను మోదీ వైబోలోనే పంచుకునేవారు. కాగా, వైబో అకౌంట్‌లో గతంలో మోదీ పెట్టిన ఫొటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్‌ ఫొటోతో సహా పూర్తి వివరాలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్‌(ఖాళీ)గా కనబడుతోంది. అకౌంట్‌లోని సమాచారాన్ని తొలగించే వరకు ప్రధాని ఇప్పటి వరకూ 115 పోస్టులు  చేశారు.

 

ఇక భార‌తీయ కార్పొరేట్ దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో చైనాకు షాకిచ్చారు. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ హు జిజిన్‌ భారతీయులను ఎద్దేవా చేస్తూ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుకు మహీంద్ర గ్రూప్స్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర దీటైన జవాబిచ్చారు. చైనా యాప్‌ల నిషేధంపై హు జిజిన్‌ స్పందిస్తూ..‘ ఒకవేళ, చైనీస్ ప్రజలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని అనుకుంటే.. వారికి భారతీయ వస్తువులే కనిపించవు.. భారతీయ మిత్రులారా, జాతీయత కంటే ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయని గమనించండి.’ అని సోష‌ల్ మీడియా కేంద్రంగా మ‌న‌ల్ని కెలికాడు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా ఘాటుగా స్పందించారు. ‘మమ్మల్ని రెచ్చగొట్టినందుకు కృతజ్ఞతలు.. మీ వ్యాఖ్యలు ఇండియా ఇంక్‌ (ఇండియా ఇన్‌కార్పొరేట్‌) పెరిగేందుకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నా. ఖచ్చితంగా మేం పరిస్థితులకనుగుణంగా సరైన సమయంలోనే ఎదిగి చూపిస్తాం.’ అని గట్టి సమాధానమిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: