ఇటీవల ఏపీ శాసనమండలిలో ఎలాంటి సీన్లు జరిగాయో అందరికీ గుర్తే ఉండుంటుంది. మండలికి అప్రాప్రియేషన్ బిల్లు, మూడు రాజధానుల బిల్లు వచ్చిన నేపథ్యంలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య పెద్ద గొడవే జరిగింది. అసలు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు తన్నేసుకున్నారు కూడా. అయితే లోపల వైసీపీ వాళ్లే తమ మీద దాడికి దిగారని టీడీపీ వాళ్ళు చెబితే, కాదు కాదు టీడీపీ వాళ్లే మమ్మలని తన్నారని వైసీపీ నేతలు చెప్పారు. చివరికి ఎవరిని ఎవరి తన్నారో జనాలకు మాత్రం అర్ధం కాలేదు.

 

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే తాజాగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... ప్రజలకు.. ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా మండలిలో అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారని మండిపడ్డారు. దీని వల్ల సకాలంలో జీతాలివ్వలేకపోయామని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు తప్పు వైసీపీ నేతలు చేసి, ఆ తప్పుని తమపై తోసేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

 

అసలు ఆరోజు మండలిలో అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదించి, ఆ తర్వాత మూడు రాజధానులు గురించి చర్చ చేద్దామంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు అడ్డుపడ్డారని గుర్తు చేస్తున్నారు. తాము అప్రాప్రియేషన్ బిల్లుకు వ్యతిరేకంగా లేమని, కానీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నామని, ఇదివరకే ఆ బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపారని, అయినా సరే మళ్ళీ  వైసీపీ ఆ బిల్లుని మండలికి తీసుకొచ్చిందని మండిపడుతున్నారు.

 

మొదట అప్రాప్రియేషన్ బిల్లుని ఆమోదించుకుందామని మండలి ఛైర్మన్ చెబితే, కావాలని మంత్రులు మూడు రాజధానులు బిల్లుపై చర్చ జరగాలని రచ్చ చేశారని, ఆ క్రమంలోనే లోకేశ్ ఫోటోలు తీస్తుంటే మంత్రులు దాడి చేయడానికి దిగారని, అప్పుడే తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇక సమయం అయిపోవడంతో అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందకుండానే మండలి వాయిదా పడిందని, కేవలం వైసీపీ వాళ్ళు వల్లే బిల్లు ఆమోదం పొందలేదని, ఇక ఆ విషయాన్ని అడ్డంపెట్టుకుని, ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: