మళ్ళీ చిలకలూరిపేటలో రచ్చ జరిగింది.  నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళగా, అక్కడ ఎంపీ కారును రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. అసలు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును వైసీపీ నేత కోటిరెడ్డి ప్రశ్నించగా, పరామర్శ కోసం మాత్రమే వచ్చానని ఎంపీ చెప్పారు. అయినా పట్టించుకోకుండా.. శ్రీకృష్ణదేవరాయలు వాహనానికి అడ్డుపడి వాగ్వాదానికి దిగారు.

 

అనధికారిక కార్యక్రమానికి వచ్చినా..ఇలా అడ్డుకోవడం సరికాదని ఎంపీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పోలీసులు రంగంలో దిగి రజిని వర్గీయులకు సర్ది చెప్పి పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే గతంలో కూడా పురుషోత్తపట్నం వచ్చిన శ్రీకృష్ణని రజిని వర్గీయులు అడ్డుకుని హడావిడి చేశారు. అయితే ఎంపీ శ్రీకృష్ణతో...మిగిలిన ఎమ్మెల్యేలకు లేని ఇబ్బంది కేవలం రజినికే ఎందుకు వస్తుంది అంటే? దానికి కారణం క్యాస్ట్ పాలిటిక్స్ అని అర్ధమవుతుంది.

 

చిలకలూరిపేటలో మంచి నేతగా పేరున్న వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ 2019 ఎన్నికల్లో జగన్ మాట మీద పోటీ నుంచి తప్పుకుని రజినికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ రావడంతో మర్రి...రజిని విజయానికి కృషి చేశారు. ఎన్నికల్లో రజిని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక మర్రి వర్గాన్ని...రజిని దూరం పెట్టేసారు. దీంతో మర్రి వర్గం...తమ సామాజికవర్గం(కమ్మ) అయిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సపోర్ట్ తీసుకుంటున్నారు. ఏ పని అయినా ఆయనకు చెప్పి చేయించుకుంటున్నారు.

 

ఇక ఈ విషయంలో రజిని వర్గం ఎంపీపై గుర్రుగా ఉంది. అందులో చిలకలూరిపేట వచ్చిన ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా నియోజకవర్గంలో కమ్మ డామినేషన్ పెరిగిపోయి, మళ్ళీ మర్రి లైన్‌లోకి వచ్చేస్తారేమో అని భయంతో రజిని వర్గం...ఎంపీని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం కల్పించుకుని చెక్ పెట్టకపోతే ఈ చిలకలూరిపేట పంచాయితీ సద్దుమణగడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: