పులివెందుల-కుప్పం రాష్ట్రంలో ప్రత్యేకమైన నియోజకవర్గాలు. పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అయితే, కుప్పం చంద్రబాబుకు కంచుకోట...పులివెందులలో ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలేదు. అలాగే కుప్పంలో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ జెండాగాని ఎగరలేదు. పులివెందులలో అప్పుడు వైఎస్సార్, ఇప్పుడు జగన్‌కు వచ్చిన విధంగా చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీలు ఎప్పుడు రాలేదు.

 

అయితే పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీకి భారీ మెజారిటీలు రావడానికి కారణాలు లేకపోలేదు. పులివెందులలో దాదాపు 50 శాతంపైనే రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఉంటాయి. అందుకే వైఎస్సార్ ఫ్యామిలీకి భారీ మెజారిటీలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపైనే తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ఈ మధ్య నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సుజనా చౌదరీ, కామినేని శ్రీనివాస్‌ సమావేశం వ్యవహారంలో వైసీపీ నేతలు కమ్మ కులం అంతా కలిసి జగన్‌పై కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక దీనిపై తెలుగు తమ్ముళ్ళు రివర్స్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు జగన్ చుట్టూ రెడ్డి సామాజికవర్గమే ఉన్నారని, రాష్ట్రంలో రెడ్డి ఆధిపత్యం నడుస్తుందని మండిపడుతున్నారు. అసలు జగన్ గెలిచేదే క్యాస్ట్ మీద అని, పులివెందులలో ఎక్కువ రెడ్లు ఉండబట్టే జగన్‌కు అంత మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. అదే కుప్పంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కమ్మ ఓట్లు చాలా తక్కువని, ఇక్కడ బీసీలే ఎక్కువని  అయినా సరే చంద్రబాబుకు మంచి మెజారిటీతోనే గెలుస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

 

ఆఖరికి మొన్ననారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరిలో, ఇక బాలయ్య పోటీ చేసే హిందూపురంలో కూడా కమ్మ ఓట్లు చాలా తక్కువని తమ్ముళ్ళు చెబుతున్నారు. కానీ పులివెందులలో మాత్రం ఎన్ని రెడ్డి ఓట్లు ఉన్నాయో అందరికీ తెలుసని, క్యాస్ట్‌ని నమ్ముకున్నారు కాబట్టి, జగన్ అక్కడే పోటీ చేస్తున్నారని, ఒకసారి వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తే జగన్‌కు ఎంత మెజారిటీ వస్తుందో చూడాలని అంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలవడానికి కారణమే జగన్ బొమ్మ అని, 175 నియోజకవర్గాల్లో ఆయనే అభ్యర్ధి అని అందుకే తాము ఘోరంగా ఓడిపోయామని కొందరు టీడీపీ నేతలు చెప్పిన మాటలని గుర్తు చేస్తూ వైసీపీ కార్యకర్తలు తమ్ముళ్ళకు కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: