రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన ఏపీ మంత్రులిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి ఎమ్మెల్సీ పదవులతోపాటు.. మంత్రి పదవులకు రిజైన్ చేశారు. ఎమ్మెల్సీ పదవులకు చేసిన రాజీనామాలు ఆమోదం పొందగా.. మంత్రి పదవులకు చేసిన రాజీనామాలు సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 

 

గత నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవిలతోపాటు.. పారిశ్రామికవేత్తలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీలు ఎంపికయ్యారు. ఎంపీలుగా గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవిలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నందున్న తమ ఎమ్మెల్సీ పదవులతోపాటు.. మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్వయంగా వచ్చి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పిస్తే.. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ పంపారు మోపిదేవి. వీటిని మండలి ఛైర్మన్‌ వెంటనే ఆమోదించేశారు. వీరి రాజీనామాలను ఆమోదించడంతోపాటు.. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీ ఉన్నట్టుగా నోటిఫికేషన్‌ జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

 

ఇక ఎమ్మెల్సీ పదవులతోపాటు.. వీరిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. స్వయంగా సీఎం జగన్‌ను కలిసి తమ మంత్రి పదవులకు రాజీనామాలిచ్చారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సీఎం జగన్‌ వీరి రాజీనామాలను ఇప్పుడే ఆమోదిస్తారా..? లేక కొంత సమయం తీసుకుంటారా..? అనేది చూడాల్సి ఉంది.

 

తమ విధుల్లో సీఎం ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. పూర్తి స్వేచ్ఛతో మంత్రులుగా విధులు నిర్వహించామన్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఆసక్తికర కామెంట్లు చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతూనే.. ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు.

 

సీఎం నిర్ణయానికి అనుగుణంగా వైసీపీలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు వీరి రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి కేటాయిస్తారోననే ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: