రాజకీయంగా చాణక్యుడిగా పేరుగాంచిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తులన్నీ ఇప్పుడు ఎందుకో బెడిసికొడుతున్నాయి. గతంలో ఆయన ప్లాన్ వేశారంటే అదిరోపోయేది.. ప్రత్యర్థులు చిత్తయ్యేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆయన వేసే ఎత్తులు సొంత పార్టీనే ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలిలో టీడీపీ వేసిన ఎత్తుగడ చివరకు వికటించి తిట్లు తినేలా చేస్తోంది.

 

 

శాసన మండలిలో తమకు ఆధిపత్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది టీడీపీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందడం ఓ రొటీన్ ప్రక్రియ. ఆ బిల్లు ఆమోదం పొందకుండా ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ విషయం తెలిసీ.. తమకు మండలిలో ఆధిపత్యం ఉందన్న కారణంగా బిల్లును ఆమోదించకుండా సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయింది టీడీపీ.

 

 

ఈ ఎత్తుగడతో వైసీపీని ఇరుకునపెట్టామని చంకలు గుద్దుకున్నారు టీడీపీ నాయకులు. కానీ ఇప్పుడు దాని ఫలితంగా ఉద్యోగులకు ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు అందలేదు. పింఛన్లూ అందలేదు. దీనికంతటికీ టీడీపీ అత్యుత్సాహమే కారణమని వైసీపీ బాగానే ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు టీడీపీని బండబూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ల కారణంగానే తమకు జీతాలు రాలేదని మండిపడుతున్నారు.

 

 

పోనీ.. ఈ ఎత్తుగడ ద్వారా టీడీపీ ఏమైనా సాధించిందా అంటే అదీ లేదు. ద్రవ్యవినిమయ బిల్లును శాసన మండలి ఆమోదించకపోయినా నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్టే భావించి బిల్లు పాస్ అవుతుంది. టీడీపీ చేయగలిగిందల్లా కాస్త వాయిదా వేయడమే. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి విమర్శలు తెచ్చి పెట్టింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: