సోనియా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో దేశ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పాత్ర కాస్త వేగంగా ముందుకు పోతోంద‌నే చెప్పాలి. కశ్మ‌ర్ నుంచి మొద‌లు క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా ఆమె ఇప్పుడు కీన్‌గా అబ్జ‌ర్వేషన్ చేస్తున్న‌ట్లు 10కె జ‌న‌ప‌థ్  వ‌ర్గాల నుంచి  తెలుస్తోంది. రాహుల్ గాంధీ,ప్రియాంక‌గాంధీ, సోనియ‌గాంధీ కొద్ది రోజులుగా వాయిస్ పెంచ‌డం విశేషం. ఇందుకు రాజ‌కీయ కార‌ణాలున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. స‌మీప భ‌విష్య‌త్‌లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉండ‌టం ప్ర‌ధాన కార‌ణ‌మైతే...ఇప్ప‌టికే క‌రోనా స‌మ‌యంలో ఏమాత్రం పేద‌ల‌ను ఆదుకోలేద‌ని, మ‌రీ ముఖ్యంగా వ‌ల‌స కార్మికుల క‌ష్టాల‌కు ఎన్డీఏ తీసుకున్న ఆక‌స్మిక, అర్థ ప‌ర్థం లేని నిర్ణ‌యాలేన‌ని సోనియ‌గాంధీ విమ‌ర్శ‌లు చేశారు.

 

 ప‌దే ప‌దే వ‌ల‌స కార్మికుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని చెప్ప‌డం...స్వ‌యంగా పార్టీ ఆధ్వ‌ర్యంలో స్వ‌రాష్ట్రాల‌కు చేర్చేందుకు చర్య‌లు తీసుకోవ‌డం వంటి అంశాల‌తో  కాంగ్రెస్‌కు కొన్ని వ‌ర్గాల్లో మ‌ద్ద‌తు పెరిగిన మాట వాస్త‌వం. సోనియ‌గాంధీ చేయించిన ఓ స‌ర్వేలో కూడా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ బ‌ల‌హీన ప‌డుతోంద‌ని, కాంగ్రెస్‌కు రాజ‌కీయంగా ఎదిగేందుకు..బ‌ల‌ప‌డేందుకు త‌గిన‌ వాతావ‌ర‌ణం ఉంద‌ని తేలిన‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలో ఆమె కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ‌చ్చే సాధార‌ణ‌ ఎన్నిక‌ల నాటికి పాగ వేసేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌తో సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీ ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ఆమె ఉప‌క్ర‌మించారు. 

 

త్వ‌ర‌లోనే పీసీసీ అధ్యక్షుల నియామ‌కం చేప‌ట్ట‌డంతో పాటు రాహుల్ గాంధీకి మూడు నుంచి నాలుగు రాష్ట్రాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను, అలాగే ప్రియాంకా గాంధీకి ఉత్తారాది రాష్ట్రాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించనున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని ముఖ్య నేత‌లకు కూడా ఇత‌ర పార్టీ ముఖ్య ప‌ద‌వుల‌ను అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌ధాన స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వాల అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని వివ‌రించాల‌ని సూచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సొంతంగా సోష‌ల్ మీడియా వింగ్‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడు వాటిని మ‌రింత బ‌లోపేతం చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: