విజయసాయిరెడ్ది అంటే జగన్ కి కుడి భుజం అంటారు. సాయిరెడ్డి వైసీపీకి కర్త కర్మ, క్రియ అన్నట్లుగా ఉంటారు. నిజానికి జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లో రాజకీయంగా ఆయనకు సాయిరెడ్డి అండగా ఉండేవారు. అప్పట్లో ఆయన ఒక ఆడిటర్ గా ఉన్నా కూడా జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ రాజకీయంగా కూడా సాయం అందించారు. ఇద్దరూ కలసి కష్టాలు అనుభవించారు. ఇక 2016లో విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైన తరువాత ఆయన ప్రాధ్యాన్యత పార్టీలో ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో సాయిరెడ్డి మరింతగా బలోపేతం అయ్యారు. ఆయన 22 మంది ఎంపీలు ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శింగా ఉన్నారు. అటువంటి సాయిరెడ్డి ప్రాధాన్యత పార్టీలో తగ్గిందా అన్న చర్చ ఈ మధ్యకాలంలో వినిపిస్తోంది. దానికి కారణం జగన్ పార్టీలో మరో నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని అంటున్నారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుగా కీలమైన అధికారిక హోదాలో ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు ఈ మధ్య జరుగుతున్నాయని కూడా అంటున్నారు.

 

ఇదిలా ఉండగా సంస్థాగతమైన మార్పులలో భాగంగా సాయిరెడ్డికి ఉత్తరాంధ్రా జిల్లాలు, వైవీ సుబ్బారెడ్డికి గోదావరి, క్రిష్ణా, గుంటూర్, మిగిలిన ఆరు జిల్లాలూ సజ్జలకు  జగన్ అప్పగించారు. ఇక్కడ పార్టీ కార్యకలాపాలు చూడమని ఆయన వీరిని ఇంచార్జులుగా నియమించారు. అంతటితో కాకుండా తాడేపల్లిలోని పార్టీ కార్యకలాపాలను కూడా సజ్జల చూస్తారని పార్టీ పేర్కొంది.

 

దీని మీద ఇపుడు వైసీపీ లోపలా బయటా రచ్చ సాగుతోంది. సాయిరెడ్డి అధికారాలకు కత్తెర వేశారని, ఆయన్ని తగ్గించారని ఓ వైపు ప్రచారం సాగుతోంది. ఆయన్ని కేవలం మూడు జిల్లా ఉత్తరాంధ్రాకే పరిమితం చేశారని అంటున్నారు. మరో వైపు మాత్రం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, అలాగే షోకాజ్ నోటీస్ ఆయన రఘురామ క్రిష్ణం రాజుకు ఇచ్చారంటే ఆయన స్థానం ఏంటో చెప్పినట్లు అయిందిగా అంటున్నారు. . ఇక వైసీపీపీ నాయకుడు పదవి ఎటూ ఉందని సాయిరెడ్డి ఎప్పటికీ జగన్ కుడిభుజమేనని కూడా చెబుతున్నారు. మొత్తానికి సాయిరెడ్డికి పోటీగా సజ్జల ఎంట్రీ మాత్రం ఇంటెరెస్టింగ్ గానే ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: