తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇటీవ‌లే ఓ తీపి క‌బురు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు ఉప‌యోగించిన సెక్ర‌టేరియ‌ట్‌ను ఖాళీ చేసి, కూల్చి వేసి అక్క‌డ మ‌రో సెక్ర‌టేరియ‌ట్ నిర్మించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ల‌పెట్టిన సంగ‌తి తెలి‌సిందే. అయితే, సెక్రటేరియట్ నిర్మాణం వ్యవహారంపై ప‌లువురు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా గ‌త సోమవారం హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈ నేప‌థ్యంలో, సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను త్వరలో కూల్చివేసేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేస్తున్న సెక్రటేరియట్ కరోనా హాస్పటల్ గా మార్చాలని డిమాండ్లు తెర‌మీదకు వ‌స్తున్నాయి.


కాంగ్రెస్ ​నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ మేర‌కు కీల‌క డిమాండ్ తెర‌మీద‌కు తెచ్చారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉన్నదని, ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా సెక్రటేరియట్ ను హాస్పిటల్ గా మార్చాలని అన్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని… ఇప్పుడున్న హాస్పిటల్స్ సరిపోయే పరిస్థితి లేదనిఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సెక్రటేరియట్ కన్నా హాస్పిటల్స్ అవసరం ఎక్కువగా ఉందని దీనిపై సీఎం కేసీఆర్ ఆలోచించాలని నాగం కోరారు.ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే ఈ డిమాండ్‌ను ప్ర‌స్తావిస్తూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

కాగా, సెక్రటేరియట్ వ్యవహారం కేసులో సోమవారం హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో సీఎం కేసీఆర్ సీనియర్ అధికారుల‌తో ఫోన్ మాట్లాడినట్టు తెలిసింది. బిల్డింగ్స్ కూల్చివేతను వెంటనే ప్రారంభించాలని, ఆలస్యం చేస్తే మరెవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లే చాన్స్ ఉందని, ముందుగా బిల్డింగ్స్ కూల్చివేస్తే కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఎలాంటి సమస్యలు రావని ఆయన అన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంప్లోజివ్ టెక్నాలజీతో సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నాల‌ను నేలమట్టం చేసే ప్రక్రియ వైపు ఆఫీసర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచే చాన్స్ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: