హైదరాబాద్ లో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ దాదాపు వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో అన్ని వసతులూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా... పాజిటివ్‌ కేసుల్ని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచుతున్నారు అధికారులు. మరోవైపు... కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆక్సిజన్‌కి డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది.

 

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌  కేసులు అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఐసీఎమ్ఆర్ నిబంధనల మేరకు... పాజిటివ్‌ పేషంట్లను ఇళ్లకు పరిమితం చేస్తున్నారు అధికారులు. ఇంట్లో ఉంటూనే వైద్యం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు... కరోనా రోగుల తాకిడిని  తట్టుకోడానికి గాంధీ ఆస్పత్రితో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే... ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ఆక్సీజన్‌ పెట్టడం లేదన్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటున్న వాళ్లలో టెన్షన్ మొదలైంది.  

 

కరోనా ప్రాథమిక స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే... తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఎక్కువైంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లను కొన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు జనం. దీంతో హైదరాబాద్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా ఆక్సిజన్‌ అందుబాటులో లేకుండా పోయింది. 

 

కరోనా ప్రభావం లేనప్పుడు మార్కెట్లో ఆక్సిజన్ విరివిగా అందుబాటులో ఉండేది. మే తర్వాత కేసుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. అంతకు ముందు 10 కిలోల సిలిండర్‌ ధర 7 వేల నుంచి 8 వేల రూపాయలుంటే... ఇప్పుడు పది వేలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా దొరకడం లేదు. 12 కిలోల సిలిండర్ 10 నుండి 12 వేలు ఉండేది. ఇప్పుడు 
15 వేల వరకూ ధర పలుకుతోంది. 

 

10 కిలో సిలెండర్‌తో 8 గంటలు, 12 కిలోల సిలెండర్‌తో పది గంటల పాటు రోగికి ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంటుంది. సిలెండర్‌ పూర్తయ్యే సరికి రీఫిల్‌ సిద్ధంగా ఉండాలి. అంటే కనీసం రెండు సిలెండర్లు ఉంచుకోవాలి. అయితే ఖాళీ సిలెండర్‌ రీఫిలింగ్‌కు చాలా ఆలస్యమౌతోంది. రీఫిలింగ్‌కు 2 నుంచి 4 రోజులు తీసుకుంటున్నారు డీలర్లు. ఆక్సీజన్‌ అత్యవసరమైతే... ఎక్కువ మొత్తం చెల్లించాల్సివస్తోంది. 


  
ఇంట్లోనే చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిలిండర్లను కొంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కవ ధర చెల్లిస్తున్నారు. కరోనా తీవ్రత పెరగడంతో హైదరాబాద్‌లో ఆక్సిజన్ సిలిండర్ల గిరాకీ పెరిగింది. సిలెండర్లు దొరకడమే కష్టంగా మారడంతో... ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: