జెఫ్ బెజోస్‌...ఈ పేరు తెలియ‌ని వారు..అమెజాన్ ఈ ప్రముఖ ఆన్ లైన్ వ్యాపారం దిగ్గజం గురించి విని ఉండని వారుండ‌రేమో. అమెజాన్ సీఈవో , పౌండర్ జెఫ్ బెజోస్ ప్ర‌తి నిర్ణ‌యం సంచ‌ల‌న‌మే. 25 ఏళ్లు కాపురం చేసిన తర్వాత త‌న భార్య మెకంజీతో బెజోస్‌ విడాకులు తీసుకున్నారు. భార్య‌కు విడాకులు ఇవ్వ‌డంతో.. ఆమెకు త‌న ఆస్తిలో వాటా ఇచ్చిన స‌మయంలో ఆ భారీ డ‌బ్బు కార‌ణంగా వార్త‌ల్లో నిలిచారు. తాజాగా మ‌ళ్లీ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోన్న స‌మ‌యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిని.. ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ల‌కిందులు అవుతుండ‌గా బీభ‌త్సంగా సంపాదిస్తూ వార్త‌ల్లోకి ఎక్కారు.

 

క‌రోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో.. ప్రపంచ కుబేరుల్లో కొంద‌రి సంప‌ద స్ప‌ల్పంగా పెరిగింది. మ‌రికొంత మంది భారీగా న‌ష్టాలు చ‌విచూశారు. జెఫ్ బెజోస్ మాత్రం త‌న రికార్డును తానే తిర‌గ‌రాసుకున్నారు. అమెజాన్ షేర్లు తాజాగా 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరాయి. దీంతో ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు ఎగిసింది. బ్లూం‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల ద‌గ్గ‌ర రికార్డు స్థాయిని తాక‌గా.. అమెజాన్ సీఈవో ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు. ఓవైపు కరోనా మహమ్మారి క‌మ్ముకొస్తున్నా.. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెల‌కొన్నా.. ఈ ఏడాదిలోనే అమెజాన్ సీఈవో 56.7 బిలియన్లను ఆర్జించడం స‌రికొత్త రికార్డుగా చెప్పుకోవాల్సిందే.

 

ఇక బెజోస్ విడాకుల విష‌యానికి వ‌స్తే, బెజోస్‌-మెకంజీ 1993 న్యూయార్క్ లో కలుసుకున్నారు. ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అదే సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెజాన్ ఏర్పాటు చేశారు. అందులో ఆమె అకౌంటెంట్ గా జీవితం ప్రారంభించారు.  ఆ తర్వాత నెట్ బుక్ సెల్లర్ లో ఆమే మొదటి ఉద్యోగి. పాతికేళ్ల సంసారం జీవితం త‌ర్వాత త‌న భార్య  మెకెంజీతో గ‌త సంవ‌త్సరం బెజోస్ విడాకులు తీసుకున్నాడు.  విడాకుల కార‌ణంగా  అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న సంపాద‌న ఏమాత్రం త‌ర‌గ‌లేదు.. అంతేకాదు మ‌రింత పెరిగి.. ప్ర‌పంచ కుభేరుడిగా ఉన్న ఆయ‌న త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టుకుని ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తుకు చేరుకున్నాడు. కాగా, భార్యభర్తలుగా తాము విడాకులు తీసుకున్నా స్నేహితులుగా కొనసాగుతామని వీరిద్ద‌రూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: