గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన క‌‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండానే ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా భూతం ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఇంకెంత మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకావ‌డం లేదు. అయితే ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా రోగుల కోసం దేశంలో తొలిసారిగా ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్లాస్మా బ్యాంకును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేడు ప్రారంభించారు. ఐఎల్‌బీఎస్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

 

వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఇక క‌రోనా నుంచి కోలుకుని, 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 50 కిలోలకు పైగా బరువు ఉన్న వ్యక్తులు కోవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. పిల్లలను కన్న తల్లులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి అనర్హుల‌ని పేర్కొన్నారు. మ‌రియు డయాబెటిస్, ఇన్సులిన్ ఉన్నవారు, క్యాన్సర్‌తో పోరాడుతున్న వారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ప్లాస్మా దానం చేయడానికి అనర్హులు.

 

ఇక ప్లాస్మా దానం చేయాలనుకునే వారు ఐఎల్‌బీఎస్‌ ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వారి ప్రయాణానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్లాస్మా దానం చేసిన వారికి ముఖ్యమంత్రి సంతకం చేసిన ‘ప్లాస్మా డోనర్‌ సర్టిఫికెట్’‌ ఇస్తామని తెలిపారు. అర్హత కలిగి, ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చే వారు 1031కు కానీ వాట్సాప్ నెంబర్ 8800007722ను కానీ కాంటాక్ట్ చేయాలని కోరారు. డాక్టర్లు అందుబాటులోకి వచ్చి వివరాలు తీసుకుంటారని చెప్పారు. కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో అత్యంత బలమైన యాంటీ బాడీస్ ఉంటాయి. అవి ఇతరులకు సోకిన కరోనాను కట్టడి చేయడంలో తోడ్పడతాయి. క‌రోనా‌కు వాక్సిన్ వచ్చేంతవరకూ ప్లాస్మా థెరపీ ఉపయుక్తమవుతుంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: