అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొత్తం ఇమ్మిగ్రేషన్ విధానం చుట్టూ తిరుగుతున్నాయి. వలసదారుల పేరు చెబితే ట్రంప్ మండిపోతుంటే... వలసదారులే దేశ నిర్మాతలంటూ జో బైడెన్ వాళ్లను మద్దతుగా మాట్లాడుతున్నారు. తాను గెలిస్తే వీసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు బైడెన్.

 

ఒరిజినల్ అమెరికన్స్‌కు మేలు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్... వలసవాదులకు వీసాలు నిలిపివేస్తే... తాను అధికారంలోకి వస్తే వీసాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని జో బైడెన్ ప్రకటించారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వలసదారుల విషయంలో తమ ప్రభుత్వం కృరంగా వ్యవహరించదని డెమొక్రటిక్ అభ్యర్ది జో బైడెన్ స్పష్టం చేశారు. దేశ అభివృద్దిలో భాగస్వామిగా ఉన్న 11 మిలియన్ల వలసదారుల పౌరసత్వం కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తామన్నారు.

 

లెజిస్లేజివ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ బిల్లు పేరుతో వలస విధానాన్ని ఆధునీకరిస్తానని జో బైడెన్ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 100 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రీన్ కార్డులు , డ్రీమర్లకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. డిజిటల్ టౌన్ హాల్ ద్వారా నిర్వహించిన ఏసియన్ అమెరికన్స్ సమావేశంలో బైడెన్ పాల్గొన్నారు. హెచ్ ఒన్ బీ వీసాదారులు అమెరికాకు చేస్తున్న సేవలను కొనియాడారు.  

 

నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్...వలసవాదులపై కొరడా ఝులిపిస్తే...
జో బైడెన్‌ మాత్రం... ఇమిగ్రేషన్లకు మద్దతుగా నిలుస్తున్నారు. భారత్‌ అమెరికాకు సహజంగానే మిత్ర దేశమని... తాను అధికారంలోకి వస్తే భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని బైడెన్ గతంలోనే ప్రకటించారు. కరోనా నియంత్రణలో వైఫల్యంతో పాటు జార్జ్‌ ఫ్లాయిడ్ హత్య తర్వాత నల్లజాతీయుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్... ఎన్నికల రేసులో వెనుకపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పోల్స్‌లో జో బైడెన్‌ లీడ్‌లో ఉన్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే మాత్రం వలసదారుల కష్టాలు తీరినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: