ఏపీ రాజకీయ చరిత్రలో ఏ స్పీకర్ లేని విధంగా ప్రస్తుత స్పీకర్ తమినేని సీతారాం నడుచుకుంటున్న సంగతి తెలిసిందే. స్పీకర్ హోదాలో అసెంబ్లీలో హుందాగా వ్యవహరిస్తూనే, బయటకొచ్చేసరికి వైసీపీ నేతగా చెలరేగిపోతున్నారు. ఏ మాత్రం మొహమాట పడకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకోసారి దారుణమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

 

ఇక తన నియోజకవర్గ పరిధిలో కూడా వైసీపీ ఎమ్మెల్యేగానే నడుచుకుంటూ దూకుడుగా పనిచేస్తున్నారు. పనిచేయని అధికారులకు డైరక్ట్‌గానే వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. అటు స్పీకర్‌గా, ఇటు ఎమ్మెల్యేగా దూసుకెళుతున్న తమ్మినేనికి తన బామ్మర్ది రూపంలో షాక్ వచ్చేలా కనిపిస్తోంది. టీడీపీ నేత కూన రవికుమార్ తమ్మినేనికి బామ్మర్ది అవుతారన్న సంగతి తెలిసిందే.

 

గత మూడు పర్యాయాలు నుంచి ఈ ఇద్దరు నేతలు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. టీడీపీ ద్వారా నాయకుడుగా ఎదిగిన తమ్మినేని 2009లో ఆ పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్లిపోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో టీడీపీ తరుపున కూన రవి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో కూన టీడీపీ తరుపున, తమ్మినేని వైసీపీ తరుపున బరిలో దిగారు. విజయం కూన వైపు వచ్చింది.

 

2019 ఎన్నికల్లో విజయం తమ్మినేని వైపు వెళ్లింది. అయితే తమ్మినేని నియోజకవర్గంలోనే బాగానే పనిచేస్తున్నా....ఆయనకు ధీటుగా కూన కూడా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బాగా దూకుడుగా పనిచేసే నాయకుడు కూననే. ఈ క్రమంలోనే ఆయన పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నారు. అధికారులని బెదిరిస్తున్నారని ఆయనపై కేసులు వస్తున్నాయి.

 

అయితే కేవలం వైసీపీ పెట్టించే కేసులని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజల నుంచి కూనకు సానుభూతి కూడా వస్తుంది. ఒకవేళ ఈ నాలుగు సంవత్సరాల్లో తమ్మినేని ఏమన్నా కాస్త వెనక్కి తగ్గితే కూన పై చేయి సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా తమ్మినేనికి బామ్మర్దితో కష్టమే అని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: